ఆయనో మాజీ ఎమ్మెల్యే. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచే పాలిటిక్స్‌లోకి వచ్చారు. ప్రస్తుతం అధికారపార్టీలో టచ్ మీ నాట్‌గా మారిపోయారు. పార్టీ పిలిచినా ఉలుకు లేదు.. పలుకు లేదు. అలిగారా? లేక జారిపోతున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
టీఆర్‌ఎస్ ప్లీనరీకి డుమ్మా..!
జలగం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుడు మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ కారణాలతో మౌనంగా ఉండిపోయారు వెంకట్రావు. పార్టీ రారమ్మని పిలిచినా.. ఏ కార్యక్రమానికీ వెళ్లడం లేదు. చివరకు టీఆర్‌ఎస్ ప్లీనరీకి రావాలని ఆహ్వానించినా కదలడంలేదు. దీంతో జలగం టీఆర్ఎస్‌లో ఉంటారా.. జారిపోతారా అని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు.
వనమాను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో అలిగారు..!
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడిగా కాంగ్రెస్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వెంకట్రావు మొదట్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కొత్తగూడెంలో గెలిచారు. వైఎస్‌ఆర్ వర్గంగా ముద్రపడ్డ ఆయనకు.. సీనియర్ పొలిటీషియన్ రేణుకా చౌదరితో పడేది కాదు. తర్వాతి కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు వెంకట్రావు. ఆ తర్వాత జిల్లాలో చాలామంది గులాబీ గూటిలోకి వచ్చేశారు. 2018లో మరోసారి కొత్తగూడెం నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆపై వనమాను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై అలిగారు ఈ మాజీ ఎమ్మెల్యే.
ఆహ్వానం ఉన్నా జలగం ప్లీనరీకి ఎందుకు వెళ్లలేదు?
వనమా టీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు జలగం వెంకట్రావు. తన వర్గాన్ని మాత్రం అట్టేపెట్టుకుని ఉన్నారు. ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లాలోని టీఆర్ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ పెడితే వెంకట్రావు వెళ్లలేదు. ఇటీవల విజయగర్జన సభ కోసం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమీక్షలు చేస్తే ఎన్నికల్లో ఓడిన నేతలకు పిలుపు రాలేదు. దీంతో కొంత చర్చ జరిగింది. కానీ.. ప్లీనరీకి ముఖ్యనేతలను ఆహ్వానించడంతో జిల్లాలోని మిగతా నాయకులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఆహ్వానం ఉన్నా జలగం వెంకట్రావు వెళ్లలేదు. దీంతో వెంకట్రావుకు ఏమైంది అని పార్టీ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డాయి.
టీఆర్ఎస్‌లో ఉంటారా? జారిపోతారా?
టీఆర్ఎస్‌లో తనకు సరైన గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారనే భావనలో జలగం వెంకట్రావు ఉన్నట్టు సమాచారం. తన మనసులో మాటను బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోతున్నారు. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారో.. లేక గుడ్‌బై చెబుతారో కూడా పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట. టీఆర్ఎస్ పెద్దలు కూడా జలగం సమస్య ఏంటో వాకబు చేయకపోవడంతో అనుచరులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడీగా ఉండటంతో.. ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. అందుకే జలగం మౌనంగానే టీఆర్ఎస్‌లో ఉంటారా? లేక జారిపోతారో అని చర్చ జరుగుతోంది. మరి.. ఈ మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ కదలికలు ఏంటో కాలమే చెప్పాలి.