Raja Singh Suspension : తెలంగాణ బీజేపీలో కొత్త ఫ్లోర్ లీడర్ ఎవరు? డబుల్ Rలో.. పార్టీ ఎవరికి జైకొడుతుంది..? సారథ్య బాధ్యతలు చేప్టటేదెవరు? కాషాయ పార్టీలో జరుగుతున్న చర్చేంటి?
వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నుంచి MLA రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. ఈ చర్యపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు.. అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తప్పించారు. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగానూ రాజాసింగ్‌ను పక్కన పెట్టినట్టు అయ్యింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ కోరడంతో.. ఆయనపై ఇప్పట్లో సస్పెన్షన్ ఎత్తే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈలోగా అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా మరొకరిని నియమిస్తారని టాక్. బీజేపీకి శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో రాజాసింగ్ కాకుండా రఘునందనరావు, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరిలో ఒకరిని సభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్న.
దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన తర్వాత తనను ఫ్లోర్ లీడర్‌ను చేయాలని రఘునందనరావు అడిగినట్టు ప్రచారం జరిగింది. దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటం.. అప్పట్లో రాజాసింగ్‌ను మార్చే ఉద్దేశం లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ఇంతలో బీజేపీలో చేరి.. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్. ఆ తర్వాత కూడా బీజేపీ శాసనసభా పక్ష నేతను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలోనే ఆ పదవి ఆశించిన రఘునందనరావుకు పట్టం కడతారా? లేక.. టీఆర్ఎస్‌లో ఉండగా ఆ పార్టీ సభాపక్ష నేతగా పనిచేసిన ఈటలకు అవకాశం ఇస్తారా అనేది పార్టీ వర్గాల అంచనాలకు అందడం లేదట.
ఇద్దరు నేతల అనుభవాన్ని బేరీజు వేస్తే.. ఈటల వైపే బీజేపీ పెద్దలు మొగ్గు చూపొచ్చన్నది కొందరి అభిప్రాయం. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం వస్తుందా..? వస్తే ఎంత టైమ్ ఇస్తారు అనేది పక్కన పెడితే.. పార్టీలో ఫ్లోర్ లీడర్‌కు మాత్రం ప్రొటోకాల్ ఉంటుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ప్రత్యేకంగా గది కేటాయిస్తారు. పార్టీ బ్యానర్, ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో తప్పనిసరి. బీజేపీ కేంద్ర కమిటీ సమావేశాలకు పార్టీ అధ్యక్షుడితోపాటు పార్టీ ఫ్లోర్ లీడర్‌నూ ఆహ్వానిస్తారు. అందుకే సభాపక్ష నేత పదవికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంపై ఢిల్లీ పెద్దలు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా లేక మునుగోడు ఉపఎన్నిక ఫలితం వరకు ఆగుతారా అనే చర్చ కూడా ఉంది. మరి.. బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.