తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఛాన్స్ ఎవరికి దక్కనుంది..? అధికారపార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? గవర్నర్ కోటాలో ఆయన వస్తే .. అధిష్ఠానం అటు మొగ్గు చూపుతుందా? కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఆధారంగానే ఛైర్మన్ ఎంపిక ఉంటుందా?
ముగ్గురు చుట్టూ మండలి ఛైర్మన్ పీఠంపై చర్చ..!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. శాసనమండలి ఛైర్మన్ ఎవరు అనే దానిపై అధికారపార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మరోసారి ఎమ్మెల్సీలు కావడంతో ఈ ఇద్దరిలో ఒకరు ఛైర్మన్ అవుతారని చర్చ మొదలైంది. ఇంతలో ఈ చర్చల్లోకి మరో పేరు వచ్చి చేరింది. ఆయనే మాజీ స్పీకర్ మధుసూదనాచారి. గవర్నర్ కోటాలో మధుసూదనాచారిని శాసనమండలికి పంపి ఛైర్మన్‌ను చేయొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు చూట్టూనే మండలి ఛైర్మన్ పీఠంపై చర్చ చక్కర్లు కొడుతోంది.
గుత్తాకు మరోసారి మండలి సారథ్యం అప్పగిస్తారా?
సీనియారిటీ.. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మండలి ఛైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని టాక్. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసే సమయానికి మండలి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరే సందర్భంలోనే మంత్రి పదవి హామీ పొందారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన గుత్తాను కేబినెట్‌లోకి తీసుకుంటారా లేక మరోసారి శాసనమండలి సారథ్యం అప్పగిస్తారా అన్నది క్లారిటీ రావాలి.
కడియం శ్రీహరి పేరును పరిశీలిస్తారని గుసగుసలు..!
గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన కడియం శ్రీహరికి.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక.. కడియంపై రకరకాల ఊహాగానాలు చర్చల్లోకి వచ్చాయి. వరంగల్ పర్యటనలో రొటీన్‌కు భిన్నంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి మాజీ డిప్యూటీ సీఎంకు మళ్లీ పదవీయోగం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీని చేయడంతో.. అక్కడితో సరిపెడతారా లేక శాసనమండలి ఛైర్మన్ పదవికి కడియం పేరును పరిశీలిస్తారా అనే గుసగుసలు గులాబీ శిబిరంలో వినిపిస్తున్నాయి.
గవర్నర్ కోటాలో మధుసూదనాచారి ఎమ్మెల్సీ..?
తెలంగాణ తొలి స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లిలో ఓడిపోయారు. అక్కడ గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. నాటి నుంచి మధుసూదనాచారికి లభించే పదవిపై ఎన్నో చర్చలు జరిగాయి. పదవుల పందేరానికి తెరతీసినప్పుడల్లా మాజీ స్పీకర్ పేరు రేస్‌లోకి వచ్చేది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనూ మధుసూదనా చారి పేరు వినిపించింది. కానీ.. సామాజిక, రాజకీయ సమీకరణాల కారణంగా లక్కీ సిక్స్‌లో ఆయన లేరు. అయినప్పటికీ.. గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉండటంతో.. మధుసూదనాచారిని ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే.. శాసనమండలి ఛైర్మన్ పదవికి మధుసూదనాచారి పేరూ పరిశీలనకు వచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో స్పీకర్‌గా చేసిన ఆయన.. ఇప్పుడు శాసనమండలిలో అడుగుపెట్టి ఛైర్మన్ అయితే.. ఉభయ సభలకు సారథ్యం వహించిన వ్యక్తిగా మధుసూదనాచారి రికార్డు సృష్టిస్తారు. మరి.. అధికారపార్టీ నజర్‌లో ఎవరున్నారో చూడాలి.