పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడం వెనక ఉన్నది ఆయనేనా? తన డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పు రాజేశారా? ఏపీ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
అనూహ్యంగా సలహాదారు పోస్ట్ చేపట్టిన ఉద్యోగ సంఘాల మాజీ నేత..!
చంద్రశేఖర్‌రెడ్డి. ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు. సర్కార్ పిలిచి మరీ ఆయనకు పీట వేసింది ప్రభుత్వం. రెండేళ్ల పదవీకాలంతో ఉద్యోగుల సంక్షేమం చూసుకునేలా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. చంద్రశేఖర్‌రెడ్డికి ఆ పదవి రావటానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి APNGO ప్రెసిడెంట్ బండి శ్రీనివాసరావు. అయితే ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, సూర్య నారాయణ తదితర నేతలు తీవ్రంగా వ్యతిరేకించినా.. చంద్రశేఖర్ రెడ్డి అనూహ్యంగా సలహాదారు పోస్ట్‌ను సంపాదించగలిగారు.
బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ పరిశీలించలేదని విమర్శలు..!
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల తరపున మద్దతు ఉన్నది వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణ వంటి నాయకులు. బొప్పరాజు, మురళీకృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి..బ్యాచ్ అంతా అప్పట్లో సీఎం చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. ఢిల్లీ గడ్డపై నాడు బాబు చేసిన ధర్మపోరాట దీక్షలో వీళ్లంతా ముందు వరసలో నిలబడ్డారు కూడా. బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఇలా ఉన్నప్పటికీ.. చంద్రశేఖర్‌రెడ్డికి వైసీపీ ప్రభుత్వం పదవి కట్టబెట్టిందనే విమర్శ ఉంది.
చంద్రశేఖర్‌రెడ్డి కోర్కెల చిట్టాను ప్రభుత్వం పక్కన పెట్టిందా?
అడ్వైజర్ పోస్ట్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. ఆపై చంద్రశేఖర్‌రెడ్డి తనకు సచివాలయంలో ఒక క్యాబిన్, సిబ్బంది, ఇతర ప్రొటోకాల్ కావాలని కొన్ని డిమాండ్స్ పెట్టినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చంద్రశేఖర్‌రెడ్డికి సలహాదారు పోస్ట్ ఇవ్వటం రాంగ్ స్టెప్ అని ఫీలవుతున్న ప్రభుత్వ వర్గాలు ఈ కోరికల చిట్టాను పక్కన పెట్టినట్టు సమాచారం.
ఉద్యోగులు నెలరోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా సలహాదారు అడ్రస్ లేరా?
కిరీటం ఉంటే లాభం ఏంటి..? సింహాసనం.. వంది మాగధులు కూడా కావాలని భావిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి వర్గమే పీఆర్సీ సెగను రాజేస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉండి సమస్య సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డిపై ఉంది. ఇప్పుడు ఉద్యోగులు ఏకంగా నెల రోజుల కార్యాచరణ ప్రకటించినా, ఆందోళనకు సిద్ధం అవుతున్నామని చీఫ్ సెక్రటరీని కలిసి నోటీసు ఇచ్చినా.. సలహాదారు మాత్రం అడ్రస్ లేరు. తన డిమాండ్ల చిట్టా తీర్చనందుకు ప్రభుత్వంపై ఈ రకంగా బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు ఉద్యోగుల్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఈ రకంగా ప్రభుత్వంపైనే వారిని ఎగదోస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అన్న ఉత్కంట ఉద్యోగ వర్గాల్లో ఉంది.