అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది?
ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారం రోజుల హస్తిన టూర్ ముగిసింది. ఢిల్లీ వెళ్లిన రెండు రోజుల తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ లభించింది. ఆ తర్వాత ఆయన కోరిన రెండు రోజుల గడువు ముగిసింది. మళ్లీ పీయూష్‌గోయల్ అపాయింట్‌మెంట్ కోరినా అటువైపు నుంచి స్పందన లేక తిరుగు ప్రయాణం అయ్యారు మంత్రులు, ఎంపీలు. వస్తూ వస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరించిన ధాన్యాన్ని ఇండియా గేట్ ముందు పారబోస్తామని హెచ్చరించారు. దీనితో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత హీట్ పుట్టించబోతుంది అన్న వాదనలు మొదలయ్యాయి.
కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు వ్యూహరచన..!
తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్.. బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రతినిధుల బృందం డిమాండ్ చేసినట్టుగా కేంద్రం నుంచి లేఖ తీసుకుని రాకుండా తిరిగొచ్చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హస్తినకు వెళ్లిన వాళ్లు ఏం సాధించారు అనే కోణంలో విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలను ప్రతినిధుల బృందం చేసిందని.. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికారపార్టీ వాదన. ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల కామెంట్స్ ఇప్పడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
నిరసనల్లో అదే ఊపు కొనసాగిస్తారా?
ఇప్పటికే ధాన్యం సేకరణపై రాష్ట్రంలో దశల వారీగా ఉద్యమం చేపట్టింది ప్రభుత్వం. స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు నిరసనలతో హోరెత్తించారు. తర్వాత నియోజకవర్గాల స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లారు నాయకులు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్స్‌పై భగ్గుమన్నారు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు. అదే ఊపును ఇకపైనా కొనసాగించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవైపు విమర్శలకు బదులిస్తూనే.. బీజేపీని.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా రాజకీయ వ్యూహ రచన చేస్తోంది టీఆర్ఎస్. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు అనే ప్రశ్నల పట్టించుకోకుండా భవిష్యత్ కార్యాచరణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతోందట అధికారపార్టీ.