దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ కాబోతున్నాయి. ఆ సమావేశానికి NCP చీఫ్ శరద్‌పవార్ అధ్యక్షత వహించబోతున్నారు.
ఇప్పటికే ఢిల్లీలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించిన విపక్షాల భేటీకి టిఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్‌తో కలసి వేదిక పంచుకోవడం ఇష్టం లేదన్నది టీఆర్ఎస్ వాదన. మరోవైపు ఎన్సీపీ, బీఎస్పీలతోపాటు పలుపక్షల మద్దతు కోసం సంప్రదింపులు జరిపింది బిజెపి. ఆ సమయంలో టిఆర్ఎస్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరలేదు. వరస క్రమంలో విపక్ష పార్టీలకు ఫోన్లు వెళ్తాయని అనుకుంటున్నారు. ఆ క్రమంలో టీఆర్ఎస్‌తోనూ మాటలు కలుపుతారని సమాచారం. అప్పుడు బీజేపీకి టీఆర్‌ఎస్ ఏం చెబుతుందన్నది ప్రశ్న.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బీజేపీ అభ్యర్థికి టిఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు. విపక్షాల అభ్యర్థిపై క్లారిటీ వస్తే కానీ టిఆర్ఎస్ మద్దతుపై స్పష్టత రాదు. అభ్యర్థులు నచ్చకపోతే రాష్ట్రపతి ఎన్నికలకు గులాబీపార్టీ దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయట. అందుకే రెండు పక్షాలు అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూసే ధోరణిని ఎంచుకునే వీలుంది. వాస్తవానికి టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు అంచనాలకు అందవన్నది విశ్లేషకుల మాట. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని భావిస్తున్నారు. కాకపోతే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.