టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం లోపించిందా? ఎమ్మెల్యే కోటాతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఇదే చర్చ జరుగుతోందా? సామాజిక సమతుల్యత కోసం చివరి వరకు ప్రయత్నించినా ఎందుకు సాధ్యం కాలేదు?
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై చర్చ..!
తెలంగాణలోని 9 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటంతో.. ఆ వేడి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఏకగ్రీవాలు అయినచోట ఒకలా.. పోటీ తప్పదనుకున్నచోట మరోలా చర్చలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో మొదలైన హడావిడి.. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే సరికి అధికారపార్టీలో పీక్‌కు వెళ్లింది. ఒకేసారి 18 మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో.. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ తీసుకున్న జాగ్రత్తలేంటి? అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? అని గులాబీ శిబిరంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే కోటాలో నలుగురు ఓసీలకు చోటు..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తీసుకుంటే.. ఆరుగురు సిట్టింగ్‌లలో ఒకరు ఓసీ.. ముగ్గురు బీసీ.. ఇంకొకరు మైనారిటీ.. మరొకరు ఎస్సీ ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో కొత్తగా ఎమ్మెల్సీ అయిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లు నలుగురు, బీసీ ఒకరు.. ఇంకొకరు ఎస్సీ ఉన్నారు. ఈ లెక్కలు.. ఎంపికలు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో చివర్లో రెండు పేర్లు డ్రాప్..!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తీరుపైనా కొందరు ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీలలో పదవీకాలం పూర్తవుతున్న వారిలో 9 మంది ఓసీ సామాజికవర్గం. ఎన్నిక కోసం అభ్యర్థులను ప్రకటిస్తే అవే సామాజిక లెక్కలు ఉన్నాయి. అయితే రెండు పేర్లు చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి గాయకుడు సాయిచంద్ పేరు వినిపించింది. నిజామాబాద్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆకుల లలిత పేరు చర్చల్లోకి వచ్చింది. వివిధ కారణాలతో ఈ రెండు పేర్లు జాబితా నుంచి మిస్. ఈ రెండు స్థానాల్లోనూ ఓసీలకే పట్టం కట్టారు. దీంతో క్యాస్ట్ బ్యాలెన్స్ చేయలేకపోయారా అన్న చర్చ నడుస్తోంది.
చివరి క్షణంలో అవకాశం కోల్పోయినవారికి.. మళ్లీ ఛాన్స్ దక్కని వారికి పార్టీ ఇంకోలా న్యాయం చేస్తుందనే చర్చ ఉంది. కాకపోతే.. సామాజిక తూకం సరిగా లేదంటూ పార్టీలో జరుగుతున్న చర్చకు టీఆర్ఎస్ ఏం చెబుతుందో చూడాలి.