బీజేపీ చీఫ్ సంజయ్ విమర్శలకు ఆ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? తమదాకా వస్తే కానీ.. టచ్ చేయకూడదని అనుకుంటున్నారా? తమ మౌనాన్ని రాజకీయ వ్యూహంగా సమర్ధించుకుంటోంది ఎవరు? పార్టీ నేతల సైలెన్స్‌పై అధిష్ఠానం ఆరా తీస్తోందా?
సంజయ్ విమర్శలకు ఇంద్రకరణ్‌రెడ్డి కౌంటర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపైనా.. టీఆర్‌ఎస్ నేతలపైనా ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సంజయ్ ఎన్ని ఆరోపణలు చేసినా.. ఓ రేంజ్‌లో విమర్శలకు దిగుతున్నా.. జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిక్కురు మనడం లేదు. తిట్టింది తమను కాదని అనుకుంటున్నారో ఏమో.. పెదవి విప్పి కౌంటర్లు వేసే వాళ్లు లేరు. ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు.. సీనియర్లు అందరిదీ ఒకటే తీరు. టీఆర్ఎస్ వర్గాలకు ఏమైంది? బీజేపీకి విమర్శలను ఎందుకు ఖండించడం లేదో కేడర్‌కు అంతుచిక్కడం లేదట. మొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒక్కరే కయ్‌మన్నారు. అధిష్ఠానం చీవాట్లు పెట్టిందో ఏమో.. తాజాగా రేఖానాయక్ కౌంటర్ వేశారు. హైదరాబాద్ నుంచి చెబితే గానీ.. సొంతంగా మాట్లాడలేరా అని గులాబీ శ్రేణులు ప్రశ్నలు సంధిస్తున్నాయట.
తనదాకా వస్తే కానీ మంత్రి కదలలేదా?
మున్సిపల్ ఉద్యోగాల్లో డబ్బులు వసూళ్లు చేశారని.. చెరువులు కబ్జా పెట్టారని.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు సంజయ్. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న మంత్రి.. వెంటనే జిల్లాకు వచ్చి కౌంటర్ ఇచ్చారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి సంజయ్ రాజకీయ విమర్శలు చేస్తున్నా.. మాట్లాడని నాయకుల నుంచి మొదటిసారి ఇచ్చిన జవాబు అదే. పైగా తనదాకా వస్తే కానీ.. మంత్రి కదలలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంకోవైపు మంత్రి స్పందించిన తీరు.. అస్సలు తమకేమీ పట్టనట్టు ఉన్న ఎమ్మెల్యేలు… ముఖ్య నాయకుల వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజాగా విరుచుకుపడిన రేఖానాయక్
ఉమ్మడి జిల్లా నాయకుల మౌనంపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టిందట. ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందట. అధినేతకు నివేదికలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సంజయ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని ఎప్పటికిప్పుడు కౌంటర్ ఇస్తే బీజేపీ హైలైట్ అవుతుందనే అభిప్రాయంలో ఎమ్మెల్యేలు ఉన్నారట. అందుకే రియాక్ట్ కావడం లేదనే సంకేతాలు పంపుతున్నారట. అదే నిజమైతే తాజాగా ఎమ్మెల్యే రేఖానాయక్ ఎందుకు విరుచుకుపడ్డారు? అదే విధంగా ఇతర ఎమ్మెల్యేలు స్పందిస్తే సీన్ మరోలా ఉంటుంది కదా అని కేడర్ వాదిస్తోందట. మరి.. జిల్లా నేతల మౌనం వెనుక కథేంటో కాలమే చెప్పాలి.