కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు పక్షాల మధ్య కొత్త అంశం సరికొత్త కొట్లాటకు వేడి రాజేస్తోంది.
రుణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానాలపై నిప్పులు తొక్కుతున్నారు గులాబీ నాయకులు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రానికి వినిపించారు. అక్కడి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. దీంతో రుణం కోసం రణం చేయాలని రాష్ట్రంలోని అధికారపక్షం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం మూడు దశల్లో ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే.. వైఖరి మార్చుకోవాలని ఢిల్లీకి లేఖ రాయడం అందులో మొదటిది. స్పందన లేకపోతే.. ఈ నెలాఖరులో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి మోడీ ప్రభుత్వ తీరును శాసనసభలో ఎండగట్టే ప్రయత్నం చేయడం రెండోది. ఈ సందర్భంగా కేంద్రం చేస్తున్న అప్పులు.. ఆర్థిక విధానాలను అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ప్రస్తావించే ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
మొదటి, రెండు దశల యుద్ధానికి కేంద్రం చలించకపోతే.. సమస్యను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న వెసులుబాటులను టీఆర్‌ఎస్ సర్కార్ పరిశీలించే అవకాశం ఉంది. ఇలా మూడు విధానాల్లో పోరాటం చేస్తూనే.. ప్రజల్లో అటెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమాలకూ రూపకల్పన చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వ వైఖరివల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ పాలకులు. పైగా రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొని ఉండటంతో ఈ అంశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లి పొలిటికల్‌గా పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారట. రుణ అనుమతుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకుంటుందో లేదో తెలియదు. కానీ.. రుణం కోసం చేసే రగడ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.