Munugode bypoll : ఉపఎన్నికపై ఇంకా స్పష్టత లేకపోయినా.. మునుగోడులో బైఎలక్షన్ పొలిటికల్ ఫీవర్ స్టార్ అవుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు కత్తులు దుసుకునేందుకు సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు ప్రకటించేశాయి. మరి.. ఈ కూతలు.. నేతల కోతలతో మునుగోడులో మునిగేది ఎవరు? తేలేది ఎవరు? లేట్స్ వాచ్..!
తెలంగాణలో అందరి దృష్టీ మునుగోడుపైనే. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక.. రాజకీయ పార్టీలు అక్కడ కార్యక్రమాల స్పీడ్ పెంచాయి. ఇదే నెలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార శంఖారావాలకు శ్రీకారం చుడుతున్నాయి కూడా. ఈ నెల 20నే టీఆర్ఎస్ మునుగోడులో బహిరంగ సభకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. తర్వాతి రోజు బీజేపీ సభ ఉంది. ఆ సభకు బీజేపీ అగ్రనేత అమిత్ షా వస్తున్నారు. బీజేపీ సభ కంటే ఒకరోజు ముందు టీఆర్ఎస్ సభకు ప్లాన్ చేయడంతో మునుగోడులో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది.
లక్ష మందితో సభ నిర్వహించాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. అప్పుడే ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరినట్టు అవుతుందని అధికార పార్టీ లెక్కలేస్తోంది. ఆ సభలో మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పడంతోపాటు.! బీజేపీపై గులాబీ దళపతి సీఎం కేసీఆర్ నిప్పులు చెరుగుతారని గులాబీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అమిత్ షా హాజరయ్యే సభకు ఒక రోజు ముందు జరుగుతున్న మీటింగ్ కావడంతో.. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ పదునైన విమర్శలు చేస్తారని అంచనా.
బీజేపీ కూడా 21న జరిగే అమిత్ షా సభను విజయవంతం చేయాలనే తలంపుతో ఉంది. టీఆర్ఎస్ ఎన్నికల ఎత్తుగడకు విరుగుడు మంత్రం వేయాలన్నది కమలనాథుల ఆలోచన. ఆ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు మరికొందరు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఉపఎన్నిక సమీపించే కొద్దీ మునుగోడులో బీజేపీ అనుకూల వాతావరణం నెలకొనేలా పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. దానికి అమిత్ షా సభ బాట వేస్తుందనే లెక్కల్లో ఉన్నారు బీజేపీ నేతలు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల మాదిరే దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు కమలనాథులు. ముందురోజు సభలో కేసీఆర్ చేసే విమర్శలకు.. సవాళ్లకు.. అమిత్ షా కౌంటర్ ఇస్తారా? లేక రాష్ట్ర నేతలతోనే మాట్లాడిస్తారా? బీజేపీ కౌంటర్లు ఏంటీ అనే ఆసక్తికర చర్చ ఇప్పటి నుంచే జరుగుతోంది.
రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై చెప్పినా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. మునుగోడులో పాదయాత్రకు ప్రణాళికలు వేసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లేలాన్నది కాంగ్రెస్ ప్లానింగ్. అలాగే మునుగోడులో అమిత్ షా సభ రోజే 20 వేల మందితో ప్రదర్శనకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. వంట గ్యాస్ ధర పెరుగుదలను నిరసిస్తూ.. గ్యాస్ సిలిండెర్లతో ప్రదర్శనకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్ సైతం ఇదే తరహ నిరసనకు పూనుకొంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా తలపెట్టే ఈ కార్యక్రమాలు మునుగోడు ఉపఎన్నికలను మరో దశకు తీసుకెళ్తాయనే వాదన ఉంది.
మూడు ప్రధాన పార్టీలు మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఇక్కడ మునిగే పార్టీ ఏంటి?.. ఒడ్డున పడే పార్టీ ఏంటనే ఉత్కంఠ నెలకొంది. బహిరంగ సభల ద్వారా బల ప్రదర్శనకు దిగి సత్తా చాటడం ఒకటైతే.. ఓటరు నాడి పట్టడం మరో ఎత్తు. దానికితోడు మునుగోడులో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఉన్న నాయకులు జారిపోకుండా కాపు కాయడం ఎక్కువైంది. పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినా.. హామీలు గుప్పించినా.. అసంతృప్తులు ఆగడం లేదు. అందుకే మునుగోడులో గోల్ కొట్టేది ఎవరన్నది ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి.