కొండెపి వైసీపీలో కోప తాపాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఠాల కుమ్ములాటలతో చేజేతులా సీటు పోగొట్టుకున్నా అక్కడి నేతల్లో మార్పు లేదట. గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం రిపేర్లు చేసినా.. సేమ్ సీన్. కొత్త ఇంఛార్జ్‌కి అప్పుడే చుక్కలు చూపిస్తోంది ప్రత్యర్థి వర్గం. ప్రత్యర్థి పార్టీల మీద చేయాల్సిన నెగిటివ్ ప్రచారాన్ని.. సొంతపార్టీ మీదే కరపత్రాలు వేసి మరీ చేస్తున్నారట. శ్రుతి మించి రాగాన పడుతున్న కొండెపి కుమ్ములాటలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మాదాసి వెంకయ్య.. వరికూటి అశోక్‌బాబు. ఈ ఇద్దరి చుట్టూనే కొండపి వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అశోక్‌బాబు వైసీపీ కొండపి ఇంఛార్జ్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. గతంలో ఇంఛార్జ్‌గా పనిచేసిన మాదాసి వెంకయ్య అనుచరులతో కలిసి ప్రత్యేకగా ప్రొగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. నియోజవర్గం ఒకటే అయినా.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఎవరి వర్గం వాళ్లదే. అస్సలు పడదు. రోజుకో కొత్త గొడవ సెగలు రేపుతూ ఉంటుంది. తాజాగా గోడపై రాతల చెరిపివేత.. కరపత్రాల పంపిణీ నిప్పు రాజేసింది.
కొండపి వైసీపీ కార్యాలయ గోడ మీద ఉన్న ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు పేరుపై కొందరు తెల్లటి పెయింట్ వేశారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పొక్కి పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఆ మధ్య టంగుటూరులో వైసీపీ ప్లీనరీ సమయంలోనూ అశోక్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలు బడ్డీ బంకుల వద్ద కరపత్రాలు పంపిణీ చేవారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఇంఛార్జ్ పదవి ఎలా ఇస్తారని ఆ కరపత్రాల్లో ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం కలిగించిన వారికి అశోక్‌బాబు సాయ పడ్డారని వాటిల్లో ఆరోపించారు కూడా. అక్కడితో ఆగకుండా.. బాలినేని, వైవీ సుబ్బారెడ్డిలపై గతంలో అశోక్‌బాబు నోరు పారేసుకున్నారని.. అలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించితే ఓటమి తప్పదని ఆ కరపత్రాల్లో హెచ్చరించడం చర్చగా మారింది.
ఆ కరపత్రాలను ఎవరు ముద్రించారు? ఎందుకు పంపిణీ చేశారు? ఇందులో మాదాసి వర్గం ప్రాత్ర ఉందా లేదా అని కొండపి వైసీపీలో ఒక్కటే చర్చ. టీడీపీకి చెందిన పక్క నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండపి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. పార్టీలో ఈ రచ్చ పీక్స్‌కు వెళ్తోంది. ఈ గ్రూపుల గోల పైస్థాయిలోనే కాకుండా మండలాలకు కూడా పాకింది. పార్టీ ఇంఛార్జ్ గా ఎవరు ఉన్నా ఓ వర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోంది. రెండోవర్గం వైరిపక్షంగా మారిపోతుంది. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాదాసి వెంకయ్య.. మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్. ఆయన పార్టీలో చేరే వరకూ ఇంచార్జ్ గా ఉన్న అశోక్ బాబు కలసి పనిచేయక పోవటంతో ఓడిపోయామనేది మాదాసి వర్గం అనుమానం.
మాదాసి వెంకయ్యను డీసీసీబీ చైర్మన్‌ను చేసింది వైసీపీ అదిష్టానం. ఇంకోవైపు ఇంఛార్జ్ పదవి పోయినా టంగుటూరులోనే తన మకాం ఏర్పాటు చేసుకున్న అశోక్ బాబు అండ్ టీమ్ మాదాసి వర్గానికి ఎప్పుడూ చెక్ పెడుతూ ఉండేది. ఇంతలో ఇంఛార్జ్ పదవి నుంచి వెంకయ్యను తప్పించి అశోక్ బాబుకు తిరిగి పగ్గాలు అప్పగించింది. ఆ హోదాలో లోకల్ వైసీపీ నేతలు, కార్యకర్తలతో అశోక్‌బాబు సమావేశాలు ఏర్పాటు చేస్తే.. అందులో మాదాసి వర్గం కనిపించలేదు. ఇప్పుడు గోడపై రాతల చెరిపివేత.. కరపత్రాల వరకు సమస్య శ్రుతిమించింది. వీటి వెనక ఎవరున్నారో కానీ.. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి. మరి.. ఈ సమస్యను వైసీపీ అధిష్ఠానం పరిష్కరిస్తుందా? గత ఎన్నికల్లో చేజారిన సీటులో ఈసారి పాగా వేసేందుకు ఏం చేస్తుందో చూడాలి.