తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో రేవంత్‌కు సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎవరి గోల వారిదేనా? రాహుల్‌ను విమర్శించినా పార్టీ నేతల నుంచి స్పందన లేదా? నేతల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసిందా? రేవంత్ వర్గం తప్ప ఇంకెవరూ మాట్లాడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మీదకు రావాలంటే బ్రహ్మాండం బద్ధలవ్వాలనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా.. ఆయనతో తమకు పడకపోయినా.. సోనియా, రాహుల్ గాంధీలను ఎవరైనా విమర్శిస్తే.. నలువైపుల నుంచి కాంగ్రెస్ నేతలు విరుచుకుపడేవారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు సీనియర్లు మొదలుకొని.. జూనియర్ల వరకు నోటికి పనిచెప్పేవారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక.. పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రేవంత్ వర్గం తప్ప ఇంకెవరూ మారు మాట్లాడటం లేదు. డ్రగ్స్ ఎపిసోడ్‌లో రాహుల్ పేరు ప్రస్తావించినా సీనియర్ల నో రియాక్షన్! రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా రావడం కాంగ్రెస్ సీనియర్లలో చాలా మందికి నచ్చలేదన్నది ఓపెన్ టాక్. ఈ విషయంలో కొందరు సైలెంట్ అయితే.. మరికొందరు ఓపెన్‌గానే యుద్ధం మొదలుపెట్టారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌కు అనుకూలం..వ్యతిరేకం అనే రెండు వర్గాలు తయారయ్యాయి. గతంలోనూ ఈ తరహా వర్గాలు ఉన్నా.. పార్టీ అంశాలకు వచ్చేసరికి కలిసిపోయేవారు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో డ్రగ్స్ చుట్టూ విమర్శలు తిరుగుతున్నాయి. కోర్టులో పరువు నష్టం దావా వేసేంత వరకు సమస్య వెళ్లింది. ఈ సమస్యపై మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించింది అధికారపక్షం. పరీక్షలకు రాహుల్ గాంధీ సిద్ధమా అని టీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చకు పెట్టింది. రాహుల్ పేరును తీసుకొచ్చినా గాంధీభవన్ నుంచి, కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఉలుకు లేదు.. పలుకు లేదు. రేవంత్ ఇంటిపై దాడిని ఆయన సొంత వ్యవహారంగా చూశారా? సీనియర్లను రేవంత్ పట్టించుకోవడం లేదా? సీనియర్లు రావడం లేదని రేవంత్ వారిని దూరం పెడుతున్నారా? పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్ తోపాటు మరో నాయకుడు మహేష్‌గౌడ్ తప్పితే ఇంకెవరూ స్పందించలేదు. రేవంత్ ఇంటిపై దాడి జరిగినా కాంగ్రెస్ నేతల నుంచి రియాక్షన్ లేదు. రేవంత్ ఇంటిపై దాడి ఆయన సొంత వ్యవహారంగా పార్టీ సీనియర్లు భావించారా? రాహుల్ గాంధీని ఈ ఎపిసోడ్‌లోకి తీసుకొచ్చినా ఎందుకు మాట్లాడలేదు? దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. సీనియర్లను పీసీసీ చీఫ్ పట్టించుకోవడం లేదా? లేక సీనియర్లు టచ్ మీ నాట్‌గా ఉంటున్నారని రేవంత్ వర్గం దూరం పెడుతోందా? అన్నది ఒక చర్చ. ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్‌పై గట్టిగానే ఉంది. పార్టీ తరఫున సభలు, సమావేశాలు పెట్టినా సీనియర్లకు సమాచారం లేదన్నది ఒక వాదన. దీనిపై హైకమాండ్‌కు కంప్లయింట్లూ వెళ్తున్నాయి. అందుకే తాజా పరిణామాలపై ఎవరూ స్పందించడం లేదని సమాచారం. మరి.. ఈ వర్గపోరు రానున్న రోజుల్లో ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.