OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్‌గుడ్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ రాష్ట్ర పెద్దల ప్లాన్. అందుకే… ఈసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుతో జరగవు. అయినా సరే… గుర్తు తప్ప మిగతావన్నీ పార్టీల ప్రమేయంతోనే జరుగుతాయి. ఆయా పొలిటికల్ పార్టీస్ నేతలు, సానుభూతిపరులే ఎన్నికలో ఎక్కువగా పోటీ చేస్తారు. అందుకే… బీజేపీ కూడా తమ కార్యకర్తలను బరిలో దించుతామని చెబుతోంది.
READ ALSO: Adam Mosseri: ఈ నైపుణ్యాలతో కోట్ల విలువైన ఉద్యోగాలు ..
ఈ పరిస్థితుల్లో… బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇది సవాలేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాళ్ళు తమ పరిధిలో మెజార్టీ స్థానాలను గెలిపించుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని, అలా చేయలేని పక్షంలో పట్టు కోల్పోయిన, బలహీనులుగా ముద్ర పడుతుందన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రస్తుతం పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నా… ఇద్దరు అర్బన్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళని వదిలేస్తే… మిగతా ఆరుగురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలు సవాలేనంటున్నారు పరిశీలకులు. రాష్ర్ట వ్యాప్తంగా ఆ పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని పక్కన పెడితే… కనీసం వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్న చోటైనా… క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపగలుగుతుందా? ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు బలం ఉండి గెలిచినవా లేక గాలివాటంలో వచ్చినవా అన్న సంగతి కూడా తేలిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని కలలుగంటున్న పార్టీ సత్తా ఏంటో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌తో తేలిపోతుందన్న అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించుకోవడానికి కార్యకర్తలు కష్టపడ్డారని, ఇప్పుడు గ్రామాల్లో కార్యకర్తల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి బీజేపీ వర్గాల్లో. కానీ… ఇక్కడే పార్టీలోని వర్గ విభేదాల కోణం కూడా బయటపడుతోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోవడమే కాకుండా… డిపాజిట్ కోల్పోయింది. అది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది కాబట్టి… మొత్తం బాధ్యత ఆయనదే అన్నట్టు మాట్లాడారు కొందరు నాయకులు. చాలా మంది ముఖ్యులు సైతం బైపోల్ విషయంలో అంటీ ముట్టనట్టు వ్యవహరించారట. దాంతో… రేపు స్థానిక ఎన్నికల్లో అయినా అంతా కలిసి పని చేస్తారా? ఒక తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల పరిధిలో సరిగా సీట్లు రాకపోతే… సదరు ఎమ్మెల్యే, ఎంపీలు బాధ్యత వహిస్తారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. దీన్ని బట్టే ఎవరి దమ్మేంటో కూడా తెలిసిపోతుందని అంటున్నారు కాషాయ లీడర్స్.
READ ALSO: Off The Record: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతుల స్వరం పెరుగుతోందా..?