Off The Record: అమరావతి రైతుల గురించి కూటమి పార్టీల మధ్య కొత్త చర్చలు నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు మనోళ్ళు అనుకున్న రైతుల వాయిస్ మెల్లిగా పెరుగుతుండటం ప్రభుత్వ పెద్దల్ని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. రాజధానిలోని కొందరు రైతులు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ… ఏకంగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. కొంత కాలంగా రాజధాని ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. తమను సీఆర్డీఏ అధికారులు వేధిస్తున్నారని, సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే… అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ… గెజిట్ వచ్చేలా చూడాలని, అప్పుడే తమకు భరోసా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు రైతులు. తమకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నది వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రైతులతో చర్చించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా కూడా ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే.. బాగా బ్యాడ్ అయిపోతామన్న చర్చ ప్రభుత్వ పెద్దల మధ్య కూడా మొదలైందట. రైతుల సమస్యలు ఇలాగే ఉంటే.. వాళ్ళు ఇంకా వాయిస్ పెంచితే….. కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి రైతులను పట్టించు కోలేదంటూ ఇన్నాళ్ళు చెప్పామని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా… ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం ఇబ్బందికరమైన పరిణామమేనని అంటున్నారు అధికార పార్టీ నేతలు కొందరు. రాజధాని రైతుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోతే…ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలపడుతోంది. రాజధాని రైతులు గతంలో దీక్షలు చేసినప్పుడు ఆదుకుంటామని, అన్ని సమస్యలు తీరుస్తామని ఇచ్చిన హామీల్ని గుర్తు చేసుకుంటున్నారు కూటమి నేతలు.
READ MORE: Adam Mosseri: ఈ నైపుణ్యాలతో కోట్ల విలువైన ఉద్యోగాలు ..
రైతులు ప్రస్తుతానికైతే… మాట్లాడ్డం, ప్రశ్నించడం వరకే పరిమితం అయ్యారని, ఇది ఇంకా ముదిరి వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వస్తే మాత్రం…తలెత్తుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉందట కూటమి వర్గాల్లో. అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని… ఆ భూమి ఇచ్చిన రైతుల సమస్యలపై దృష్టి పెట్టకపోతే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టేనన్నది ప్రస్తుతం కూటమి వర్గాల్లో జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకమంటూ ప్రచారం చేశామని, ఇప్పుడు రైతుల నుంచి ఇబ్బందులు వస్తే మనం సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమని అంటున్నారట అధికార పక్షంలోని ఎక్కువమంది నాయకులు. ఇన్ని రకాల ఈక్వేషన్స్‌ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా… రైతుల సమస్యల్ని పరిష్కరించాలని నిర్ణయించినట్టు సమాచారం. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్‌లో వేసిన సరిహద్దు రాళ్ళు వివిధ కారణాలతో తొలగిపోయాయంటూ… మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు రైతులు. మంత్రి వెంటనే రియాక్ట్ అవడంతో…. వచ్చే నెల 15 నుంచి హద్దు రాళ్ళ సమస్యను పరిష్కరించే ప్రోగ్రాం పెట్టబోతున్నారట సీఆర్డీఏ అధికారులు. మూడు నెలల్లోగా సరిహద్దు రాళ్ళు వేయడం పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నట్టు తెలిసింది. మొత్తంగా…. అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించి ప్రభుత్వం… ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా… జనానికి ముఖం చూపించలేమన్న అభిప్రాయం ఉందట..