Telangana Congress Politics : పిల్లి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా ఉందట.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నేతల పరిస్థితి. మునుగోడు ఎపిసోడ్ తర్వాత అది మరీంత హీటెక్కింది. సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా.. ఒకరిపై ఒకరు పావులు కదుపుతున్నారట.
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం మునుగోడు ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. అధికార trs.. బీజేపీలు ఎన్నికలు కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇప్పుడు ఎన్నికలు వస్తే తలనొప్పి తప్పదనే చర్చ నడుస్తోంది. బరిలో దింపేందుకు బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడంతోపాటు.. డబ్బును పోగు చేయాల్సి ఉంటుంది. అంత చేసినా ఫలితం ఏంటన్నది ప్రశ్నే. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో నియోజకవర్గంలో కాంగ్రెస్ చెదిరిపోయింది. కేడర్ బలంగా ఉందని భావిస్తున్నా.. రాజగోపాల్ వ్యవహారం ముదురుతున్నా.. అక్కడ ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకోలేదు. అందుకే ఉపఎన్నిక వస్తే ఎలా అనే టెన్షన్ కాంగ్రెస్ శిబిరంలో కనిపిస్తోంది. ఇంత టెన్షన్‌లోనూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరుకు దిగడం కలకలం రేపుతోంది. ఒకరిపై ఒకరు… వ్యూహాలను అమలు చేసే పనిలో పడ్డారట. దానిపైనే కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మునుగోడులో ఉపఎన్నిక వస్తే అభ్యర్థి ఎవరనే దానిపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యతిరేక శిబిరం.. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి పేరును తెరమీదకు తెచ్చిందట. జానారెడ్డి, రేవంత్ సన్నిహితంగా ఉంటారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలను రేవంత్ ఖాతాలో వేసే పనిలో పడ్డారట. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి రఘువీర్ పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన మునుగోడకు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ.. జానారెడ్డి కుమారుడి పేరును చర్చల్లో పెట్టడం వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడే ఉందని రేవంత్ టీమ్ అనుమానిస్తోందట.
తాజా ప్రచారానికి విరుగుడు మంత్రంగా రేవంత్ అండ్ టీమ్ మరో చర్చను తెరపైకి తెచ్చిందట. నల్లగొండ జిల్లాకు పీసీసీ చీఫ్ రేవంత్‌ను రావొద్దని గతంలో ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే ఆ బాధ్యత కూడా అక్కడ ఉన్న నేతలే తీసుకోవాలని ప్రశ్నలు సంధిస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే మునుగోడు ఉండటంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డే అన్నీ చూసుకుంటారని చెబుతున్నారట. పార్టీ కోసం అవసరమైతే వెంకటరెడ్డే బరిలో ఉంటారని ప్రచారం చేస్తున్నారట. దీనికితోడు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఎన్నికల ఇంఛార్జ్‌గా పెడితే సరిపోతుందని ఆ చర్చకు అదనపు అంశాలను జోడిస్తున్నారట. అప్పుడైతే పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి ప్రచారానికి వెళ్తారని ముక్తాయిస్తున్నారట. మొత్తానికి కాంగ్రెస్‌లోని రెండు శిబిరాలు మునుగోడు అంశాన్ని పైచెయ్యి సాధించడానికి.. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు ఉపయోగించేసుకుంటున్నాయి.
మునుగోడులో ఉపఎన్నిక వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా.. ఇలా అంతర్గత పోరును చర్చల్లో పెట్టడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. రాజకీయ చెలాగటంలో ఎవరు స్థాయిలో వారు పావులు కదిపేస్తున్నారు. క్షేత్రస్థాయి అంశాలను పట్టించుకోకుండా కాలక్షేపం చేయడం.. రణతంత్రం లేకపోవడం కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోందట.