మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా టిడిపి మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశోక్‌గజపతి స్పందిస్తూ ఈ ఏడాదిలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ తతంగంవెంటనే ముగిసే సూచనలు లేవు.
అశోక్ స్థానంలో సంచైతను నియమించడం వైసీపీ రాజకీయ కోణంలోనే జరిగిందనడం నిస్సందేహం. ఆమె ఆయన అన్న ఆనందగజపతి కుమార్తెనే గాని ఆమె తల్లి ఉమ గతంలోనే ఆయనతో విడాకులు తీసుకున్నారు. పెద్దకుమారుడుగా ఆనందగజపతి వున్నంత కాలం ఆయనే ట్రస్ట్ చైర్మన్‌గా వున్నారు. ట్రస్టు నిబంధనల పేరిట ఆయన తర్వాత పురుషసంతానమైన అశోక్‌గజపతి పదవి చేపట్టారు. తన కుమార్తె విజయలక్ష్మిని, ఆనందగజపతి రెండో భార్య ఊర్మిళను శాశ్వత సభ్యులుగా చేసి, అప్పటి టిడిపి ప్రభుత్వంలో ప్రణాళికాసంఘ ఉపాద్యక్షుడుగా వున్న కుటుంబరావు తదితరులను సభ్యులుగా వేసుకున్నారు. ఈ కాలంలో ట్రస్టుకు సంబంధించిన వందల ఎకరాల భూమి విక్రయాలు, లీజులు, అన్యాక్రాంతం ఆరోపణలు వున్నాయి. అసలు పివిజి రాజు మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చేయడంలోనే రాజుకుటుంబ ఆస్తులపై విద్యాలయాలు, దేవాలయాలపై ఆధిపత్యం తమ కుటుంబం చేతుల్లోనే అట్టిపెట్టుకోవడం ఒక వ్యూహం. 14 వేల ఎకరాలకు పైబడిన భూమి, 14 విద్యాసంస్థలు, 108 దేవాలయాలు ఈ ట్రస్టు ఆధ్వర్యంలో వున్నాయంటేనే విషయం అర్థమవుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రసక్తి లేకుండా ట్రస్టు పేరిట అశోక్‌గజపతి దీన్ని పూర్తిగా తమ చెప్పుచేతల్లో అట్టిపెట్టుకున్నారు. భూమిలో చాలా భాగం రైతుల సాగులో వున్నా వివాదాలలో వున్నది కూడా వందల ఎకరాలు. ఉదాహరణకు విజయనగరంలో ప్రభుత్వ వైద్యకళాశాల స్థాపించాలనుకున్నప్పుడు ట్రస్టు 400 ఎకరాలు కావలసిన వారికే తక్కువకు విక్రయించి ప్రైవేటు రంగంలోనే ఏర్పాటు చేయించింది. 40 ఎకరాలు జయభేరి మోటార్స్‌కు లీజుకు ఇచ్చింది. సింహాచలం ఆలయ భూములు, వేణుగోపాల స్వామి ఆలయ భూములపై చాలా వివాదాలున్నాయి. ట్రస్టు నిర్వహణ పేరిట భారీ జీత భత్యాలు సదుపాయాలు లభిస్తున్నాయి. మరోవైపున విద్యాసంస్థలలో జీతాలు అందక సిబ్బంది సమ్మెలు చేసే పరిస్థితి. అశోక్‌గజపతి వుండగా అంతా బావుందని ప్రచారం చేసేవారు. ఈ వాస్తవాలు దాటేస్తుంటారు. మహారాజ కళాశాలలో ప్రవేశాలు కూడా నిలిపేశారు. అశోక్‌హయాంలోనే దాని ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలైనాయి. సంచైతకు పెత్తనం అప్పగించాక కూడా ఇదేమీ మారింది లేకపోగా మరింత వేగం పుంజుకుంది. ఆందోళనలూ పెరిగాయి. ఆమె బిజెపితో కూడా సంబంధం గల వ్యక్తిగా అప్పుడు పగ్గాలు చేపట్టారు. వ్యూహాత్మకంగా ఆమెను ముందుంచి ట్రస్టు ఆస్తుల అదుపు కోసం జిలా మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు పథకం పన్నారని టిడిపి ఆరోపణలు చేసింది. అదలా వుంచితే సంచైత వ్యవహారశైలి కూడా వివాదాస్పదంగానూ ఏకపక్షంగానూ నడిచిందిన ఆమె సన్నిహితులైన అనధికార వ్యక్తుల పెత్తనంపైనా నిరసనలు వచ్చాయి. రాజకుటుంబ సభ్యులు బహిరంగంగానే విమర్శలు సంధించారు. ఈ లోగా రామతీర్థలో రాముడి విగ్రహం విధ్వంసం వంటి ఘటనలు వివాదం పెంచాయి. దానికి కూడా చైర్మన్‌గా వున్న అశోక్‌గజపతి కేంద్రంగా వైసీపీ టిడిపి ఆరోపణలు సంధించుకున్నాయి. తను లక్షవిరాళం పంపిస్తే తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ట్రస్టు కేంద్రాన్ని విజయనగరం కోట నుంచి విశాఖకు తరలించాలని ఆమె ప్రతిపాదించడంపైనా విమర్శలు వచ్చాయి. వ్యక్తిగతంగానూ ఆమెనై వ్యతిరేకులు తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఈ పూర్వరంగంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది గనక ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిని పునరుద్దరించడంతోనే అంతా అయిపోదు. ప్రజల ఆస్తులు సద్వినియోగం చేసే దిశలో చర్యలు చేపట్టడం అన్నిటికన్నాముఖ్యం. రాజులు జమీందారుల యుగం పోయి ప్రజాస్వామ్యం వచ్చినా ప్రభుత్వాలు వేల ఎకరాల భూమిని ఆలయాలను పరోక్షంగా వారి పెత్తనంలోనే కొనసాగించడం సమంజసమేనా? వాటిని ప్రైవేటీకరించడానికి కూడా విక్రయించడానికి అవకాశం ఇచ్చేస్తారా? పొలాలు దున్నే రైతులు విద్యాసంస్థల్లో ఆలయాల్లో ఉద్యోగులు సిబ్బంది ప్రయోజనాలు కాపాడటానికి రక్షణలేమిటి? వైసీపీ టీడీపీ ఘర్షణలో ట్రస్టు ఆధిపత్యం చేతులు మారడం తప్ప విధానాలు మారకపోతే సమాజానికి ఉపయోగమేమిటి? న్యాయస్థానాలు ఈ విషయాలు కూడా ఆలోచించి తగు ఆదేశాలివ్వాలి.