కేరళలో పినరాయి విజయన్ నాయకత్వాన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్‌డిఎఫ్ యుడిఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్ ఒక స్థానం తప్ప అన్నీ కోల్పోయింది. దానికి ముందు తర్వాత తుపాన్లు, శబరిమలై వివాదం నుంచి సిబిఐ ఐఎన్‌ఎ దాకా పినరాయి ప్రభుత్వానికి పెనుసవాళ్లుగా మారాయి. కోవిడ్19 ను ఎదుర్కోవసి వచ్చింది. రాజకీయంగా పాలనా పరంగా సమర్థవంతమైన కృషితో వీటిని జయప్రదంగా అధిగమించి ఆ ప్రభుత్వం మరోసారి ప్రజల విశ్వాసం పొందింది.
గత దశాబ్ది వరకూ వామపక్షాలకు కంచుకోటగా వున్న పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంకు ఒక్క స్థానం కూడా రాని ప్రతికూల పరిస్తితుల్లో కేరళ విజయం వామపక్షాల మనోధృతిని నిలబెట్టింది. ముఖ్యమంత్రి తప్ప పూర్తిగా కొత్తవారినే మంత్రివర్గంలో చోటు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు 11 కొత్త వారు మంత్రులుగా నియమితులయ్యారు. సిపిఐ మంత్రులు నలుగురూ కొత్తవారే బాధ్యతలు తీసుకున్నారు. 20వ తేదీన ప్రమాణస్వీకారం 500 మందితో నిరాడంబరంగా జరిగింది. వివిధ మతాల తరగతుల ప్రతినిధులు కూడా ఆ వేడుకలో పాల్గొనడం కేరళ సామాజిక స్వరూపాన్ని ప్రతిబింబించింది. ముమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్రతారలు ఈ విజయాన్నిమనసారా ఆభినందించడమే గాక కొత్త ప్రభుత్వం కేరళను అభివృద్థి పథంలో మరింత ముందుకు తీసుకుపోగదనే విశ్వాసం ప్రకటించారు.
అయిత మీడియాలో కొంతమంది వ్యాఖ్యాతలకు గత ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రిగా వున్న కె.కె.శైలజను మళ్లీ తీసుకోకపోవడమే ఏకైక ఎజెండాగా మారింది. కరోనాపై జరిగిన పోరాటంలో నిరోధంలో శైలజ టీచర్ సమర్థంగా పనిచేసి అంతర్జాతీయంగానే అభినందలను పొందిన మాట నిజమే. అయితే ఆమెను కావాలని తప్పించినట్టు చేసే వ్యాఖ్యానాలు పూర్తిగా అవాస్తవికమైనవే గాక నిరాధారమైనవి. ఆమెతో పాటు గత మంత్రివర్గంలో వున్న టి.రామకృష్ణన్, పి.రామకృష్ణన్, ఎంఎం మణి, కడంపల్లిసుధీరన్, సి.రవీంద్రనాథ్, ఎ సిమొయిద్దీన్ లు కూడా ఈ కొత్త ప్రభుత్వంలో లేరు. దేశమంతటికీ తెలిసిన ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్, ఇపి జయరాజన్ వంటివారు ఎన్నికలలోనే పోటీ చేయలేదు.
ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన వారు మళ్లీ పోటీ చేయడం వద్దన్న సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం దీనికి కారణమైంది. అదే విధంగా మంత్రివర్గంలో పూర్తిగా కొత్తవారిని తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందరూ కొత్తవారైతే ముఖ్యమంత్రి పినరాయి వ్యక్తిగత ప్రాబల్యం పెరిగిపోతుందనే విశ్లేషణలు వూహాగానాలే అవుతాయి. ఎందుకంటే కొత్తగా మంత్రులైన వారెవరూ సిపిఎం పార్టీకి రాజకీయాలకు కొత్తవారు కాదు. దీర్గకాలంగా వున్న వారే. బాలగోపాల్ రాజీవ్ రాజేశ్ వీణా జార్జి బిందు వంటి వారంతా ప్రజాజీవితంలోనూ ఉద్యమంలోనూ సేవలందించిన వారే. సంస్తాగతంగానూ ప్రజాప్రతినిధులుగానూ సమర్థత నిరూపించుకున్నవారే.
కెకె శైలజ కూడా ఈ నిర్ణయంపై స్పందన అడిగినపుడు గతసారి మంత్రినైనప్పుడు నేను కొత్తదాన్నే కదా అని చక్కటి సమాధానమిచ్చారు. వీరిలో అత్యధికులు యువత కావడం స్వాగతించదగిన విషయం. సిపిఎంలో యువత లేదనీ పాతవారి మాటే చెల్లుతుందని ప్రచారం చేసేవారే కేరళ కమిటీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి మేయర్లుగా చిన్నవారిని ఎంపిక చేయడంతోనే ఈ ప్రక్రియ మొదలైంది,పార్టీలో పాలనలో సమాజంలో తరాల మార్పును క్రమబద్దంగా ప్రోత్సహించడం ఒక బాధ్యతా యుత కర్తవ్యం. కేవలం కెకెశైలజను మళ్లీ మంత్రిగా తీసుకోకపోవడం పెద్ద రాజకీయ మార్పు కాబోదు. అప్పుడూ ఇప్పుడూ ఆమె సమిష్టి నిర్ణయాలో భాగస్వామిగానే వుంటారు. ఆమె సహాయాలు తీసుకుంటానని కొత్తమంత్రి వీణాజార్జి చెప్పారు కూడా.
ఆమెకు మాత్రమే మినహాయింపు ఇవ్వడమంటే అప్పటి ఇతర సహచరుల సంగతేమిటి? అందుకే అలా చేయలేకపోయామని పినరాయి సూటిగానే వివరించారు. నిజానికి కేరళ మీడియాలో కొందరు గౌరి అమ్మ మరణించిన నాటినుంచే ఈ మీమాంసలేవదీశారు. సీనియర్ నాయకురాలైన గౌరీ అమ్మ ఒక దశలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడినందుకు తొలగించినా ఆమె యుడిఎఫ్‌లో మంత్రిగా చేసినా ఆఖరి దశలో ఆ శక్తులతో విడగొట్టుకుని పాత వరవడికి దగ్గరయ్యారు. కేవలం మహిళ అనే కోణంలో గౌరియమ్మ వ్యవహారానికి ఇప్పటి మంత్రివర్గంలో శైలజ లేకపోవడానికి పోలిక తేవడంలో అర్థం లేదు. శశిథరూర్ మురళీధరన్ వంటి కాంగ్రెస్ నేతలకు శైలజ టీచర్‌పై ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది గానీ గతంలో వారు ఆమెను విమర్శించిన వారేనని పినరాయి అన్నారు. శైలజ విషయంలో కేంద్ర నాయకత్వం కూడా అసంతృప్తిగా వుందని కథనాలు రాగా ఇవన్నీ రాష్ట్ర కమిటీలే నిర్ణయించుకుంటాయని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమాధానమిచ్చారు.
ఒకప్పుడు అచ్యుతానందన్, పినరాయి విజయన్ మధ్య విభేదాలతో సిపిఎం ముక్కలై పోతుందని జరిగిన ప్రచారం వినిపించిన జోస్యాలు నిజం కాలేదు. కాంగ్రెస్ బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలో వల్లే సిపిఎంలో ఏ ఒక్కరో నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కాని కేరళలో ఎల్‌డిఎఫ్ మలి విజయం ముందు నుంచే వారి దాడి పినరాయిపై కేంద్రీకృతమైంది. ఇప్పుడు మళ్లీ పినరాయి మోడీ ఇన్ మండు(పంచెలో మోడీ) అని ఆయన ఆధిపత్యమే సాగుతున్నదని ప్రచారం నడుస్తున్నది. అయితే సిపిఎం కేంద్ర కమిటీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం ఈ ప్రచారాలను స్పష్టంగా తోసిపుచ్చింది. నాయకుడుగా ఆయనపాత్ర కీకమని చెబుతూనే సమిష్టి విజయంగా కేరళ తీర్పును అభివర్ణించింది. గతంనుంచి డివైఎఫ్‌ఐ అద్యక్షుడుగా వున్న రియాజ్ మంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి అల్లుడు కావడం గురించే మళయాల మీడియా రాసింది. ఆరెస్సెస్ వాదులైతే మరో అడుగు ముందుకేసి ఇస్లామిక్‌శక్తులకు ప్రభుత్వంలో చోటు కల్పించినట్టు ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఎల్‌డిఎఫ్ చారత్రిక విజయం నుంచి దృష్టి మరల్చే దుష్టయత్నాలేనని విజయన్ కొట్టిపారేశారు. మరి ఆచరణలో ఆయన ప్రభుత్వం వీటికి ఎలాంటి సమాధానమిచ్చేది చూడవలసిందే.