గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పార్టీలో చర్చగా మారాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పంచాయితీ బట్టబయలైంది. నియోజకవర్గ పరిధిలో ఎవరి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగాలన్నదానిపై చర్చ హీటెక్కించిందట. దాని చుట్టూనే ప్రస్తుతం పార్టీ వర్గాల చెవులు కొరుకుడు ఎక్కువైంది.
ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ప్రతిపాదించారట. ఆ మాటలు వినగానే కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనక పెద్ద స్టోరీనే ఉందట. ఉప్పల్ సెగ్మెంట్‌లో కొంతకాలంగా ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి.. GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అవకాశం చిక్కితే ప్రత్యర్థిని పార్టీ పెద్దల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇద్దరు నాయకులు.
బొంతు రామ్మోహన్ వ్యవహారాన్ని చెప్పకనే చెప్పేశారు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి. ఈ మధ్య కాలంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులను గోవా, తిరుమల తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు బొంతు. ఆ విషయాలను సుభాష్‌రెడ్డి ప్రస్తావించడంతో ఎవరి మీద కంప్లయింట్ చేస్తున్నారో అర్థమైపోయిందట. తీసుకెళ్తే ఏమైంది? అందులో తప్పేం లేదుకదా? అయినా.. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజు కాదని కేటీఆర్ కుండ బద్దలు కొట్టేయడంతో సుభాష్‌రెడ్డి ముఖంలో నెత్తురు చుక్క లేదట.
అయితే ఉద్యమకారులమని చెప్పుకొని తిరుగుతూ.. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని కేటీఆర్ టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ కామెంట్ మాత్రం బొంతును ఉద్దేశించే కేటీఆర్ చేశారని గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంపై బొంతు రామ్మోహన్ బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇదే నియోజకవర్గం పరిధిలోని ఒక డివిజన్‌కు ఆయన భార్య శ్రీదేవి GHMC కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. అవకాశం చిక్కితే ఉప్పల్‌లో పట్టు పెంచుకునే పనిలో దూకుడుగా వెళ్తున్నారు మాజీ మేయర్.
ఉప్పల్ టీఆర్ఎస్‌లో పంచాయితీని కొలిక్కి తెచ్చే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఎప్పటికప్పుడు అక్కడి పరిణామాలపై ఒక కన్నేస్తూనే తగిన హెచ్చరికలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇద్దరికీ సూటిగా సుత్తిలేకుండా చెప్పి.. గట్టిగానే తలంటినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. కాకపోతే.. తాజా ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డే.. బొంతు విషయాన్ని ప్రస్తావించి అడ్డంగా బుక్కయ్యారని గులాబీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయట.