విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది ఇద్దరికి ఏమైందో ఏమో.. ఉప్పు నిప్పులా మారిపోయారు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదట ఇద్దరు నాయకులు. అదే శృంగవరపుకోట వైసీపీలో చర్చగా మారింది.
రఘురాజు ఎమ్మెల్సీ అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చిందని చెవులు కొరుక్కుంటాయి వైసీపీ శ్రేణులు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు.. ఎమ్మెల్సీ రఘురాజులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బొత్స ఆశీసులతో ఎమ్మెల్సీ అయ్యాక శృంగవరపుకోటలో రఘురాజు దూకుడు పెంచినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఆయన లెక్క చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. ప్రొటోకాల్ పక్కాగా పాటించాలని అధికారులు హుకుం జారీ చేసినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట. ఈ మార్పు ఏంటో అర్థంకాక ఎమ్మెల్యే బిత్తరపోతున్నారట.
మనోడే కదా అని చంకన పెట్టుకుంటే.. ఇప్పుడు ఏకంగా నెత్తిన కూర్చున్నారని ఎమ్మెల్సీ రఘురాజును ఉద్దేశించి అనుచరుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే శ్రీనివాస్‌రావు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో.. నియోజకవర్గంలో పట్టు సాధించడం ఎలాగో అర్థం కావడం లేదట. ఇన్నాళ్లూ జరిగిన పొరపాట్లు ఏంటా అని జాబితా సిద్ధం చేస్తున్నారట. వాటిని సరిదిద్దుకొనే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దూరం పెట్టిన సొంత సామాజికవర్గాన్ని మళ్లీ చేరదీసుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారట. ఎమ్మెల్సీపై ఏదోలా రివేంజ్ తీసుకోవాలని చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ మిత్రభేదంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. లేక విభేదాలను పక్కన పెట్టి మళ్లీ మిత్రులుగా ఉంటారో చూడాలి.