తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా?
గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ!
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి. తమ పార్టీలు, ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ స్టాండ్ ఏంటో స్పష్టం చేశాయి. ఈ జాబితాలో ఇరు రాష్ట్రాల బీజేపీ శాఖలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
read also : వాళ్ల వల్లే… టీడీపీకి 23 స్థానాలు : కొడాలి నాని
గెజిట్‌పై ఒకేలా స్పందించిన ఏపీ, బీజేపీ శాఖలు!
గెజిట్‌పై ఏపీ, తెలంగాణ బీజేపీ శాఖలు ఒకేలా స్పందించాయి. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు నాయకులు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి యుద్ధాలకు ఇక ఫుల్‌స్టాప్ పడుతుందని కమలనాథులు తెలిపారు. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. కొన్ని రాజకీయ పక్షాలు భిన్నంగా స్పందించిన సమయంలో బీజేపీ నాయకులు ఒకే విధంగా రాగాలు తీయడం ఆశ్చర్యపరుస్తోంది. ఏపీకి మేలే జరిగిందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పైకి చెప్పకపోయినా.. అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నేతలు అది గ్రహించలేదా లేదా అన్నది ఇతర పక్షాల ప్రశ్న. గెజిట్‌లో చాలా అంశాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇక్కడి నిపుణులు మండిపడుతున్నారు. పైగా రాష్ట్ర హక్కులు హరించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా.
ఏపీ బీజేపీ లైన్‌లోనే తెలంగాణ కమలనాథుల స్పందన
నీటి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏంటన్నది తెలంగాణలోని వివిధ పక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కార్ వైఖరి ఏకపక్షంగా ఉందని కామెంట్స్ చేస్తున్నాయి. పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు టీఆర్‌ఎస్ సిద్ధపడిన తరుణంలో బీజేపీ మరో వైఖరి తీసుకోవడమే విస్మయ పరుస్తోందని చెబుతున్నాయి ఆయా వర్గాలు. ముఖ్యంగా ఏపీ బీజేపీ లైన్‌లో స్పందించడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ విధాన నిర్ణయంలో భాగంగా స్పందించామని వివరణ!
నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఆ కోవలోనే ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్థించారు కమలనాథులు. తమపై వస్తున్న విమర్శలు బీజేపీ నేతలకు తెలియడంతో.. నష్ట నివారణ కూడా చేపట్టారు. బీజేపీ జాతీయ పార్టీ. నదీ జలాల వివాదంలో ఏంచేయాలో బీజేపీకి ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకోవడంతో రెండు రాష్ట్రాల శాఖలు స్పందించాయన్నది వారి వాదన. చెప్పడానికి ఇది బాగానే ఉన్న.. తెలంగాణలో సెంటిమెంట్‌తో ముడిపడిన అంశంలో తొందరపడకుండా ఆచితూచి మాట్లాడి ఉంటే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం. రేపటి రోజున కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగితే ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి తెలంగాణ కమలనాథులు ఏం చేస్తారో చూడాలి.