కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ రోడ్డెక్కాయి విపక్ష పార్టీలు. భారతబంద్ పాటించాయి. ఈ విపక్షపార్టీల బృందానికి దూరంగా ఉండిపోయింది అధికారపార్టీ టీఆర్ఎస్. బంద్‌కు దూరం వ్యూహాత్మకమా? ఇంకేదైనా బంధాలకు బాట పడుతోందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
భారతబంద్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్‌పై చర్చ..!
పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత్ బంద్ పాటించాయి కాంగ్రెస్, వామపక్షపార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కొన్ని ఈ ఆందోళనలకు మద్దతు తెలిపాయి. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ బంద్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ వైఖరే రాజకీయపక్షాల్లో అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. టీఆర్ఎస్‌పై మరోసారి బాణాలు ఎక్కుపెట్టేందుకు ఇంకో అవకాశం చిక్కింది.
అప్పట్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీఆర్‌ఎస్..!
గతంలో దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. కేటీఆర్ సహా ముఖ్య నాయకులు రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు కూడా. వ్యవసాయ చట్టాలలో ఉన్న లోపాలను ప్రశ్నించారు. నాడు బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడితే ఇతర విపక్షాల మాదిరే టీఆర్ఎస్ గొంతు కలిపింది. ఇప్పుడు మాత్రం పిన్‌డ్రాప్ సైలెన్స్. ఈ మౌనమే రాజకీయ విశ్లేషకులకు చర్చగా మారింది.
కేంద్రంతో సమాఖ్య సంబంధాలే తప్ప ఇంకేం లేదంటోన్న టీఆర్ఎస్..!
ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ.. తెలంగాణ గల్లీల్లో కుస్తీ అని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కేంద్రంతో తెలంగాణ సర్కార్‌కు రాజ్యాంగ బద్ధంగా ఉండాల్సిన సంబంధాలే ఉన్నాయని.. అంతకుమించి ఏమీ లేదని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నా.. కాంగ్రెస్, ఇతర పక్షాలు వాటిని విశ్వసించే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తీసుకొచ్చారు గులాబీ దళపతి కేసీఆర్. ఈ రెండు జాతీయ పార్టీలతో దేశానికి ఒరిగిందేం లేదని అప్పట్లో వాదించారు కూడా. ఆ తర్వాత ఆ ఊసే లేదు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఇటీవల రోజుల వ్యవధిలో ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ సహా.. వరసగా కేంద్ర మంత్రులను కలిసి వస్తున్నారు. తాజాగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్రం నిర్వహించిన సమావేశానికి హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మరోదఫా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
బంద్‌కు దూరం.. రాజకీయ వ్యూహమా?
ఈ పరిణామాలు గమనించిన తర్వాత .. భారతబంద్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉండటం వెనక ఇంకేదైనా రాజకీయం వ్యూహం ఉందా అనే అనుమానాలు ఉన్నాయట. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. మరి.. బంద్‌కు దూరంగా ఉన్న టీఆర్‌ఎస్ భవిష్యత్ కార్యచరణ ఏంటో కాలమే చెప్పాలి.