అధికార పార్టీలోకి వెళ్లితే ఐదేళ్లు ఢోకా ఉండదని ఎన్నో లెక్కలు వేసుకున్నారు ఆ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. ఇంతలో మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు నిద్రకరువైందట. ఉన్న పార్టీలోని కేడర్ ఎమ్మెల్యేను ఓన్ చేసుకోవడం లేదట. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లేమో కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు వాళ్లూ..వీళ్లూ కలిసిపోవడంతో కంగారెత్తిపోతున్నారట ఆ ఎమ్మెల్యే. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గండ్ర లక్ష్యంగా భూపాలపల్లిలో రాజకీయ వేడి!
శత్రువుకు శత్రువు మిత్రుడు. భూపాలపల్లిలో రాజకీయం ప్రస్తుతం ఈ సూత్రం ఆధారంగానే వేడెక్కుతోంది. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని ఆయనంటే పడని టీఆర్‌ఎస్ కేడర్.. కాంగ్రెస్ శ్రేణులు ఆడేసుకుంటున్నాయట. ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టేలా ఒకరు.. మంత్రి పదవి దక్కకుండా ఇంకొకరు వేస్తున్న ఎత్తుగడలు ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఒక్కటై పావులు కదుపుతున్న గండ్ర వ్యతిరేకులు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు గండ్ర. తర్వాత టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కి.. కాంగ్రెస్‌ను వీడి.. గులాబీ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి భూపాలపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గండ్ర. ఇంతలో జడ్పీ ఎన్నికలు రావడంతో భార్యను జడ్పీ ఛైర్‌పర్సన్‌ను చేసుకున్నారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసేలోగా మంత్రి యోగం పడుతుందని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో పాలిటిక్స్ అనూహ్య మలుపు తీసుకున్నాయి.
ఉమ్మడి శత్రువుగా భావిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో కష్టపడి గెలిపిస్తే హ్యాండిచ్చారని గుర్రుగా ఉన్న కాంగ్రెస్ కేడర్‌కు పీసీసీ కామెంట్స్ బూస్ట్‌లా పనిచేశాయి. అప్పటి వరకు కామ్‌గా ఉన్న కాంగ్రెస్ కేడర్ గండ్ర లక్ష్యంగా రోడ్డెక్కడం మొదలుపెట్టింది. గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరడం ఇష్టంలేని అధికారపార్టీలోని కొందరు.. ఇదే సమయంగా భావించి లోపాయికారిగా కాంగ్రెస్ కేడర్‌తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. గండ్రను ఉమ్మడి శత్రవుగా భావిస్తూ ఎమ్మెల్యేను ఉక్కిరి బిక్కిరి చేసే కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారట.
గండ్రకు వ్యతిరేకంగా ఏదో ఒకచోట నిరసనలు!
భూపాలపల్లిలో రైతులు చేస్తున్న ఆందోళనను క్యాష్ చేసుకునే పనిలోపడ్డాయి గండ్ర వ్యతిరేక వర్గాలు. ఎమ్మెల్యే రాజీనామా కోరే దిశగా ఈ ఆందోళనలను మళ్లించాలని చూస్తున్నారట. రైతుల ఆందోళన వెనక కూడా కొందరు టీఆర్‌ఎస్ నేతల హస్తం ఉందని గండ్ర శిబిరం అనుమానిస్తోందట. కేవలం సొంత లాభం కోసమే ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరారని కాంగ్రెస్ వర్గాలు స్వరం పెంచాయి. ఈ విధంగా స్వపక్షంలో ఉన్న గండ్ర వ్యతిరేకులు.. కాంగ్రెస్‌తో జత కలిసి నియోజకవర్గంలో ఏదో ఒకచోట నిరసనలు హోరెత్తిస్తున్నారట.
ఐదేళ్లూ హ్యాపీ అనుకున్న టైమ్‌లో కొత్త టెన్షన్!
మొన్నటి వరకు పెద్దగా ఇబ్బందులు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన గండ్రకు ఈ ఆందోళనలు మింగుడు పడటం లేదట. ఐదేళ్లపాటు హాయిగా ఉండొచ్చని వెళ్లితే ఇదేం లొల్లి అని తలపట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి గండ్ర లక్ష్యంగా భూపాలపల్లిలో జరుగుతున్న పరిణామాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌వర్గాల్లో చర్చగా మారాయి. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.