గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఆయన పేరు ఖరారు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అధికార పార్టీకి చెందిన నాయకుడే ప్రత్యర్థులకు లీకులు ఇచ్చి రచ్చ చేశారా? గవర్నర్ దగ్గర ఫైల్ క్లియరైనా వైసీపీ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ హాట్‌గా మారింది. ఇంతకీ అడ్డుపుల్ల వేయడానికి చూసింది ఎవరు?
విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం!
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు ఎప్పుడు గరం గరంగా ఉంటాయి. కీలక నాయకులంతా ఒకే పార్టీలో ఉన్నా వారి మధ్య అస్సలు పడదు. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. ఇంఛార్జుల సమక్షంలోనే దాడులు చేసుకోవడం.. అడ్డుకోవడం.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. దూషణలు.. ఆరోపణలు కామన్. వైసీపీ పెద్దలు ఎంత చెప్పినా.. సర్దుకున్నట్టే కనిపిస్తారు కానీ.. సమయం చిక్కితే మాత్రం యాక్టివ్ అయిపోతారు. గవర్నర్ కోటాలో తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునే ప్రయత్నం.. ఆ విభేదాలలో భాగమనే అనుమానాలు ఉన్నాయట.
తోటపై కేసులవల్ల గవర్నర్ సంతకం పెట్టడం లేదని ప్రచారం చేశారు
టీడీపీ నుంచి వైసీపీలోకి తోట త్రిమూర్తులు రాక కొందరు అధికారపార్టీ నేతలకు సుతారమూ ఇష్టం లేదు. మధ్యే మార్గంగా తోటను మండపేట ఇంఛార్జ్‌గా పంపినా..విభేదాలు చల్లారలేదట. తాజాగా ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నాలుగు పేర్లతో ప్రతిపాదిత జాబితా పంపించింది. దీనిలో లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషెన్‌రాజుతో పాటు తోట త్రిమూర్తులు పేరు కూడా ఉంది. అయితే ఈ ఫైల్ గవర్నర్ దగ్గరకు వెళ్లిన మూడు నాలుగు రోజుల వరకు క్లియర్ అవ్వలేదు. ఈలోపు కొన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన మీడియాల్లో తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు ఉన్నందున సంతకానికి గవర్నర్ ససేమిరా అన్నారన్న వార్తలు హెడ్‌లైన్లలో నిలిచాయి.
తోటపై ప్రచారం వెనక వైసీపీ నేత పాత్ర ఉందా?
ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ కంటే ముందే ఎమ్మెల్సీల ఆమోదంపై సంతకాలు చేశారని ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం గందరగోళం వెనుక వైసీపీకే చెందిన ఓ నేత పాత్ర ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్రిమూర్తులుపై ఉన్న 23 ఏళ్ల నాటి కేసును చూపిస్తు.. క్లీన్ ఇమేజ్ లేని వ్యక్తిని గవర్నర్ ఎలా నియమిస్తారు అన్న వాదనను ఆయన బలంగా వినిపించారట. ఆయనే ప్రత్యర్థులకు త్రిమూర్తుల విషయంపై లీకులు ఇచ్చి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని తాడేపల్లి వర్గాల్లో టాక్.
టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా కుట్ర చేశారని ఆ నేతపై పార్టీ సీరియస్?
త్రిమూర్తులుపై కేసులు ఉన్న విషయం వాస్తవమే అయినా… గతంలో హత్యా ఆరోపణలు ఉన్న రామసుబ్బారెడ్డికి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడికి గవర్నర్ కోటాలోనే టీడీపీ ఎమ్మెల్సీలను చేసిందని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై అంతర్గత వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా టీడీపీకి ఉపయోగపడే విధంగా కుట్రలు పన్నటంపై ఆ నేత మీద వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉందని సమాచారం.
అప్పట్లో లేఖ రాసి కలకలం రేపిన సదరు నేత!
ఇప్పుడే కాదు సరిగ్గా ఆరునెలల కిందట కూడా సదరు వైసీపీ నేత ఇలానే పార్టీ పరువును రోడ్డున వేసే ప్రయత్నం చేశారని అనుకుంటున్నారు. దళితుల శిరోముండనం కేసును తవ్వితీశారు. ఈ కేసులో విచారణను తొందరగా పూర్తి చేయాలని హోంమంత్రికి లేఖ రాశారు. ఆ కేసులో ఏవేవో జరుగుతున్నాయని వివిధ అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. మరి.. తాజా రగడపై పార్టీ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.