విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్‌లర్లే బాస్‌లు. నిధులు.. నియామకాల విషయంలో వారి నిర్ణయమే ఫైనల్. కానీ.. మారిన పరిణామాలతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని రగిలిపోతున్నారట వీసీలు. హక్కులను కాపాడుకునే విషయంలో ఇంకేదో చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో వీసీలకు వచ్చిన ఇబ్బందేంటి?
కామన్ రిక్రూట్‌మెంట్‌పై ఆలోచనలో పడ్డ వీసీలు!
చాలాకాలం తర్వాత తెలంగాణలో పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు వచ్చారు. ఉప కులపతులు రాకతో.. ఆయా వర్సిటీలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీల నియామకాల ప్రక్రియ మొదలవుతుందని అంతా అనుకున్నారు. ఇన్నాళ్లూ వీసీలు లేరని చెప్పి.. వాయిదా వేస్తూ వచ్చిన వారికి ఇప్పుడా ఛాన్స్ లేదు. ఖాళీల భర్తికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అర్హులైన నిరుద్యోగులు. ఇంతలో ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. యూనివర్సిటీల వారీగా కాకుండా కామన్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకాలు చేపట్టాలని భావిస్తోంది సర్కార్. ఈ నిర్ణయమే వీసీలను ఆలోచనలో పడేసిందట.
ఉన్నత విద్యామండలి సమావేశాలో వీసీలు భగ్గు!
మూడు అంశాలతో ప్రతిపాదనలు.. ఒకటి వీసీలు కోరుకున్న డిమాండ్!
కామన్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వైస్ ఛాన్స్‌లర్లతో ఉన్నత విద్యామండలి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై ఉప కులపతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు కూడా. అయితే ఉన్నత విద్యామండలి సమావేశానికంటే ముందుగానే సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్‌పై ప్రచారం జరగడంతో సమావేశంలో వీసీ భగ్గుమన్నట్టు సమాచారం. ముందుగానే నిర్ణయం తీసేసుకున్న తర్వాత సమావేశం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? మీకు ఎలా కావాలో అలా చేసేసుకోండి అని వీసీలు ఫైర్ అయినట్టు తెలుస్తోంది. కాకపోతే అధ్యాపకుల నియామకానికి సంబంధించి మూడు ఆప్షన్లతో కూడిన ప్రతిపాదనలకు వీసీలు ఓకే చెప్పారట. అందులో ఒకటి వీసీలు కోరుకున్న డిమాండ్ ఉందట. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
విద్యార్థి సంఘాలను, విద్యార్థులను రెచ్చగొడుతున్నట్టు ఆరోపణలు
ప్రభుత్వంతోపాటు ఉన్నత విద్యామండలిపై ఒత్తిడి పెంచేందుకు.. వీసీలుగా తమ హక్కులను కాపాడుకునేందుకు ఉప కులపతులు ప్రయత్నాలు మొదలుపెట్టారట. వీసీలు ఛైర్‌పర్సన్‌లుగా ఉండే సెలక్షన్ కమిటీ చేపట్టాల్సిన నియామకాలను మరో విధంగా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారట. ఇందుకోసం విద్యార్థి సంఘాలను.. విద్యార్థులను, కాంట్రాక్ట్ లెక్చలర్ల సంఘాలను వీసీలు రెచ్చగొడుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఉన్నత విద్యామండలి వర్గాలు సైతం గుర్రుగా ఉన్నాయట.
ఉత్సవ విగ్రహాలు కాకూడదని వీసీల ఆవేదన
మొత్తానికి సుధీర్ఘ విరామం తర్వాత విశ్వవిద్యాలయాలకు వీసీలు వచ్చారన్న సంతోషం తాజా గొడవలతో ఆవిరైంది. పైగా వీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రక్రియ వల్ల వర్సిటీలపై పట్టుపోతుందని అనుమానిస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.