ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్‌పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్‌లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్‌లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం?
నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్‌లో ప్రస్తావించారా?
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. సీఎం కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనలో ఆ అంశాన్నే ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారట. దానిపైనే ఇప్పుడు అధికారపార్టీలోనూ.. పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చ జరుగుతోంది.
చట్ట సవరణ ద్వారా పెంపు సాధ్యమని కేసీఆర్ చెప్పారా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు భేటీ కావడం వెనక ప్రధాన ఉద్దేశం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపేనని తెలుస్తోంది. అయితే పునర్విభజన చట్టానికి కొద్దిపాటి సవరణలు చేయడం ద్వారా ఈ సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నది టీఆర్ఎస్ వాదన. ఈ చట్టానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చట్ట సవరణ ద్వారానే ఏపీలో కలిపింది కేంద్రం. అదే విధంగా చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేస్తే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు మార్గం సుగమం అవుతుందని టీఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది.
2026 తర్వాతే డీలిమిటేషన్ అని గతంలో కేంద్ర ప్రకటన..!
చట్టపరమైన సాధ్యాసాధ్యాలు.. గత సంప్రదాయాలు.. పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలపై ప్రధానంగా అమిత్ షాతో సీఎం కేసీఆర్ మాట్లాడారట. త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మధ్య నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేసింది. మిగతా రాష్ట్రాలతో కలిపే తెలుగు రాష్ట్రాల్లోనూ 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. కానీ.. ఇంతలోనే జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం.. ఆ రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది.
కశ్మీర్‌లో జోరందుకున్న డీలిమిటేషన్..!
కశ్మీర్‌లో సాధ్యమైన అంశం తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదన్నది టీఆర్‌ఎస్ ప్రశ్న. కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో.. ఇదే సరైన సమయంగా భావించి సీఎం కేసీఆర్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. ఇందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులను ఎలా అధిగమించాలో కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లారట. మరి.. సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలను సావధానంగా విన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సానుకూలంగా స్పందిస్తారా? ప్రధాని మోడీ ఆలోచన ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.
డీలిమిటేషన్‌పై బీజేపీ లెక్కలేంటి?
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపుపై బీజేపీకి వేరే లెక్కలు ఉన్నాయి. పార్టీకి కలిగే సానుకూలతలు.. వ్యతిరేకతలను కేంద్ర నాయకత్వం ద్వారా మోడీ సర్కార్‌కు చేరవేశారు. అప్పటి నుంచి ఆ అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు పొలిటికల్ అవసరాలు పెరిగాయి. ఎన్నికలు వస్తే అందరినీ అకామిడేట్ చేయడం పెను సవాల్. ఈ విషయంలో ఎవరి వాదన వారిది. కాకపోతే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ కదలిక పరిష్కారం దిశగా వెళ్తుందో లేదో చూడాలి.