పొలిటికల్ ఎంట్రీలోనే ఆయన ఎంపీ అయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి. గెలిచి రెండేళ్లయింది. అంతలోనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ గ్యాప్ వచ్చినట్టు టాక్. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏమా కథ?
2019లో ఎంపీగా గెలిచి రాజకీయ తెరపైకి వచ్చారు
డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైద్యులు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేసి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఎంట్రీలోనే బంపర్ ఛాన్స్ కొట్టారని నాడు పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. 2019లోనే రాజకీయ అరంగ్రేటం అంటే ఆయన ఒప్పుకోరు. ఎప్పటి నుంచో పాలిటిక్స్‌లో ఉన్నానని వాదిస్తారు. కానీ.. రాజకీయ తెరపై లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం 2019లో ఎంపీగా గెలుపొందిన తర్వాతే. 2014లో ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక టీడీపీలో చేరిన సమయంలో వైసీపీతో టచ్‌లోకి వెళ్లారు సంజీవ్‌కుమార్. 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించడం.. ఎంపీగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి.
ఎంపీగా గెలిచిన ఏడాది చురుకుగా పర్యటనలు
టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. బుట్టా రేణుక తిరిగి వైసీపీలోకి వచ్చారు. కానీ… ఆమెకు వైసీపీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఈ పరిణామాలు సంజీవ్‌కుమార్‌కు కలిసొచ్చాయని చెబుతారు. ఎంపీగా గెలిచిన తర్వాత కొత్తలో ఆయన చురుకుగా కనిపించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తళుక్కుమనేవారు. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటించేవారు. ఏమైందో ఏమో.. ఏడాది కాలంగా ఎంపీ సంజీవ్‌కుమార్ అంటీముట్టనట్టు ఉంటున్నారు. గత ఆరు నెలలుగా ఆయన బయట కనిపించింది తక్కువేనట.
పార్టీ ముఖ్యనేతలతోనూ పెద్దగా సంబంధాలు లేవా?
సీఎం చెప్పడం వల్లే దూకుడు తగ్గించారని ప్రచారం
వైసీపీ ముఖ్యనేతలతోనూ ఎంపీ సంజీవ్‌కుమార్ పెద్దగా సంబంధాలు కొనసాగించడం లేదట. సీఎం జగన్ లేదా మంత్రులు జిల్లాకు వస్తే హాజరు వేయించుకుంటున్నారు. సమీక్షలకు వస్తున్నది కూడా తక్కువేనట. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. సంజీవ్ కుమార్ అధికారపార్టీకి చెందిన ఎంపీనే. అయినప్పటికీ ఒక్కసారిగా సైలెంట్ కావడం చర్చ జరుగుతోంది. తన పరిధిలోకి వచ్చే కొంతమంది ఎమ్మెల్యేలతోనే ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. సీఎం జగన్ పార్టీ ఎంపీలకు కొన్ని సూచనలు చేశారని.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చెప్పడం వల్లే సంజీవ్‌కుమార్ మౌనంగా ఉన్నారని మరికొందరు భావిస్తున్నారట.
వ్యాపారాలూ చూసుకోవాలని సన్నిహితులకు చెబుతున్నారా?
లోక్‌సభ ఎన్నికల సమయంలో డాక్టర్ సంజీవ్‌కుమార్‌కు బాగానే ఖర్చు అయిందట. ఆ లోటును పూడ్చుకోవడానికి ఆస్పత్రిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని.. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి సమయం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారాలు కూడా చేసుకోవాలని తనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలకు కూడా సలహా ఇస్తున్నారట సంజీవ్‌కుమార్. లేదంటే రాబోయే ఎన్నికల్లో ఖర్చుకు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నాట కూడా. ఈ ప్రచారంలో నిజమెంత ఉందోకానీ.. పార్టీలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రజలకు దూరంగా ఉండటం కరెక్ట్ కాదని పార్టీలో కొందరి అభిప్రాయం
కరోనా మొదటి వేవ్‌లో ఎంపీ సంజీవ్‌కుమార్ కుటుంబంలో కొందరు కోవిడ్ బారిన పడ్డారు. అందుకే బయటకు రావడం లేదనే వారు ఉన్నారు. కారణం ఏదైనా.. ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీగా ఉంటూ.. ప్రజలకు దూరంగా ఉండటం కరెక్ట్ కాదన్నది పార్టీలో కొందరి అభిప్రాయమట. మరి.. రాజకీయాలు వంటబట్టలేదో.. వర్గపోరు ఇబ్బంది పెడుతుందో కానీ.. మిగిలిన పదవీకాలంలో ఎంపీ సంజీవ్‌కుమార్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.