హుజురాబాద్ బైఎలక్షన్ ఆ ఇద్దరు మంత్రులకు పరీక్షేనా? వారి రాజకీయ భవిష్యత్ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉందా? అందుకే కంటిపై కునుకు లేకుండా పోయిందా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఏమా కథా?
హుజురాబాద్‌లో ఇద్దరు మంత్రులపై ఎక్కువ చర్చ..!
హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉపఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నది అధికార టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన మరుక్షణం గులాబీ శ్రేణులు ఇక్కడ మోహరించి పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. షెడ్యూల్ రాకముందే గెల్లు శ్రీనివాసయాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి సమరం మొదలుపెట్టింది టీఆర్‌ఎస్. గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు. పార్టీ సీనియర్లు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. ఎంత మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా.. ప్రధానంగా ఇద్దరు మంత్రులపై పార్టీ వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. వారే గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.
కొప్పుల, గంగులకు ఇది టెస్టింగ్ టైమ్?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొప్పుల, గంగుల కాకుండా కేటీఆర్ కూడా ఉమ్మడి జిల్లానే. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో పార్టీ పరంగా కీలక బాధ్యతల్లో ఉన్నారు కొప్పుల, గంగుల. ప్రధాన ఎన్నికల పర్యవేక్షణ మంత్రి హరీష్‌రావు చేతుల్లో ఉన్నా.. జిల్లా మంత్రులుగా వీరిద్దరిపై అందరి ఫోకస్ ఉంది. అందుకే కొప్పల ఈశ్వర్‌కు, గంగుల కమలాకర్‌కు ఇది టెస్టింగ్ టైమ్‌గా భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు.
కొప్పులకు జమ్మికుంట అర్బన్ బాధ్యతలు
గంగులకు హుజురాబాద్ అర్బన్ బాధ్యతలు
రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక.. కేబినెట్‌లో కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌కు చోటు దక్కింది. ఈటల రాజేందర్‌కు కౌంటర్‌గానే గంగులను మంత్రివర్గంలోకి తీసుకున్నారని నాడు చర్చ జరిగింది కూడా. ఇప్పుడు హుజురాబాద్‌లో గంగులకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనక కారణం అదే అన్నది కొందరి వాదన. పైగా ఈ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ చాలా సీరియస్‌గా డీల్ చేస్తోంది. మంత్రి కొప్పులకు నియోజకవర్గంలోని జమ్మికుంట అర్బన్‌లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. హుజురాబాద్ అర్బన్‌లో మరో మంత్రి గంగుల చూసుకుంటున్నారు.
రెండు మున్సిపాలిటీల పరిధిలో 60 వేల ఓటర్లు?
ఇద్దరు మంత్రులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో పర్యటిస్తు.. పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలో సుమారు 60 వేల ఓటర్లు ఉన్నట్టు రాజకీయ పార్టీల అంచనా. కీలకమైన ఈ ప్రాంతాల్లో మంత్రులకు సాయంగా.. మరికొందరు నేతలను అటాచ్ చేసింది పార్టీ. సాధారణంగా ఉపఎన్నిక జరిగే ఏ జిల్లాలోనైనా స్థానిక మంత్రులకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వారి ప్రభావం కూడా వర్కవుట్ అవుతుందని ఆశిస్తారు. ఆ విధంగా ఈ రెండు మున్సిపాలిటీలలో మంత్రుల వ్యూహం.. ఎన్నికల చతురత ఏ మేరకు టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తాయో అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ వారి పనితీరు ఆధారంగానే మంత్రులు రాజకీయ భవిష్యత్ ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
ఉపఎన్నిక ఫలితం మంత్రులకు అగ్నిపరీక్షేనా?
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హుజురాబాద్ ఉపఎన్నికకు దూరంగా ఉన్నారు. పార్టీ పరంగా మంత్రి హరీష్‌రావు, సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌లే మొత్తం వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఎవరి పర్యవేక్షణ ఎలా ఉన్నా.. జిల్లా మంత్రులుగా పార్టీలో ఎక్కువ హైలెట్ అవుతోంది కొప్పుల, గంగులే. ఉపఎన్నిక ఫలితమే వారికి అగ్నిపరీక్షగా పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. ఈ విషయంలో వారెంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.