ఆ జిల్లాలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ఓ పెద్ద మాఫియా. పురాతన బౌద్ధ మహాస్థూపం ఉన్న కొండపై మైనింగ్ గెద్దల కన్ను పడింది. కొండను తవ్వి గుల్ల చేయడానికి రంగం చేస్తోంది. సొంత జేబులు నింపుకోవడానికి చరిత్రను మాయం చేసేలా కుట్రలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు?
చారిత్రక కొండను తవ్వి మట్టి తరలించేలా మాఫియా ఎత్తుగడ..!
ఇది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ. దాదాపు 330 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతం. ఎంతో చరిత్ర ఈ కొండల్లో నిక్షిప్తం. అలాంటి చరిత్రను చెరిపేసే పని మొదలుపెట్టింది మైనింగ్ మాఫియా. ఆలోచన వచ్చిందే తడవుగా కొండను తవ్వి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. కొండను తవ్వి ఎర్ర మట్టి.. లైట్రేట్‌ను తరలించేందుకు.. భారీగా సొమ్ము చేసుకునేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని చెబుతున్నారు.
చిత్తూరు, గుంటూరు, విజయవాడ, మేడపాడులకు చెందిన వాళ్లకు ఎన్‌వోసీ..?
కోర్టు తలుపు తట్టిన స్థానిక రైతులు..!
కొండను తవ్వుకునేందుకు ఈ ఏడాది జూలైలో చిత్తూరు, గుంటూరు, విజయవాడ, సామర్లకోట మండలం జి. మేడపాడులకు చెందిన నలుగురికి NOC ఇచ్చేలా కొడవలి పంచాయతీ తీర్మానం చేసింది. సెప్టెంబర్‌లో రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఎంట్రీ ఇచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఓకే చెప్పడానికి సిద్ధ పడ్డాయి. ఇంతలో ఆ కొండపై అనేక ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు కోర్టు తలుపు తట్టడంతో కథ అడ్డం తిరిగింది. మైనింగ్ గురించి తెలుసుకుని పురావస్తు శాఖ అధికారులు సీన్‌లోకి వచ్చారు. కొండను తవ్వకుండా చర్యలు తీసుకోవాలిన గొల్లప్రోలు తహశీల్దారుకు లేఖ ఇచ్చారు. మైనింగ్ మాఫియా మాత్రం ప్రభుత్వంలోని పెద్దలతో తమకున్న పరిచయాలను ఇక్కడ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందట. దీంతో ఏ క్షణమైనా అనుమతులు రావొచ్చని.. మొదటలో ఐదెకరాలకు అనుమతి తీసుకుని క్రమంగా కొండను కొల్లగొడతారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
2,3 శతాబ్దాలకు చెందిన బౌద్ధ కట్టడాలు ఉన్న కొండ..!
రాణిని గుర్తు చేసుకుంటూ కొడవలి పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధి..!
తెలుగు రాష్ట్రాల్లోని పురాతన బౌద్ధ క్షేత్రాల్లో కొడవలి ఒకటి. మౌర్య అశోకుడితో ముడిపడి ఉన్న ప్రాంతంగా చెబుతారు. 2 లేదా మూడో శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ స్తూపం నిర్మించారని చరిత్రకారుల మాట. శాతవాహన రాణి అయిన కొడవలి శిరి ఎన్నో ధాన ధర్మాలు చేసి.. బౌద్ధ భిక్షువులకు గదులు.. నీటి వసతికి బావులు, స్తూపాలు నిర్మించారని ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్లు వివరిస్తారు. అందువల్లే ఈ ప్రాంతానికి రాణి పేరు అయిన కొడవలి స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. ఇప్పుడు మైనింగ్ మాఫియా అడుగులు పడితే ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.
330 ఎకరాలు విస్తరించిన కొండ.. రూ.100-200 కోట్లు వెనకేసుకునే యత్నం?
బలమైన రాజకీయ ప్రాంతాల నుంచి మైనింగ్‌కు దరఖాస్తు చేయడంతో.. రేపటి రోజున ఏదైనా జరగొచ్చని అనుకుంటున్నారు. దాదాపు 330 ఎకరాల్లో విస్తరించిన కొండను తవ్వితే వంద నుంచి రెండొందల కోట్ల వరకు మాఫియా వెనకేసుకోవచ్చని అంచనా. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చేది కొంతే అయినా.. చరిత్ర మాయమై.. మైనింగ్ కోరల్లో ధనకొండ చిక్కుకునే ప్రమాదం ఉంది. మరి.. మైనింగ్ మాట చెల్లుతుందో.. చారిత్రక కొండ నిలుస్తుందో చూడాలి.