ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల ధనదాహానికి అంతులేకుండా పోతోంది. లక్షలు మిగుల్చుకోవడానికి ఫేక్ ప్రొఫెసర్లు, ఫేక్ లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తున్నారట. కాకినాడ JNTU పరిధిలో ఉన్న 180 కళాశాలల్లో దాదాపు 200 మంది ఫేక్ లెక్చరర్లు ఉన్నారట. ఇది బహిరంగ రహస్యమే అయినా.. JNTU పట్టనట్టు వ్యవహరించడమే అనుమానాలకు తావిస్తోందట.
నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో 200 మంది అధ్యాపకులు?
రూ.40వేల వేతనం ఇస్తోన్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు..?
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో 180 అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో ఒకరిద్దరు చొప్పున 8 జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ PhD సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు నిగ్గు తేలింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే PhD తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో PhD పూర్తి చేసిన వారిని తీసుకుంటే నెలకు 90వేల నుంచి లక్ష 20 వేల వరకు వేతనం ఇవ్వాలి. అంతేసి జీతాలు ఇవ్వడం ఇష్టంలేని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు తక్కువ శాలరీకి వచ్చే ఫేక్ PhD పట్టా కలిగిన అభ్యర్థులను తీసుకుంటున్నాయట. వారికి నెలకు 40 వేల జీతం ఇస్తూ పబ్బం గడుపుకొంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలకు వచ్చే బృందాలకు పట్టని నకిలీ పట్టాలు..!
కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని PhD పట్టా తెచ్చుకుంటున్నారట. వాటిని చూపించి.. తక్కువ జీతానికే పని చేస్తామని ఒప్పుకొంటున్నట్టు సమాచారం. ఈ పోకడలను కాలేజీ యాజమాన్యాలు ప్రోత్సహించడం ఆందోళన కలిగిస్తోంది. అనుభవంలేని నకిలీ అధ్యాపకుల వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యూనివర్సిటీ అధికారులు ఏటా నిజనిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తారు. అయితే వారు నకిలీ PhD పట్టాలపై దృష్టి పెట్టకపోడం కాలేజీకి కలిసివస్తోంది. పైగా యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తనిఖీ బృందాల నోళ్లు మూయించి వేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు తెలిసినా చర్యలు తీసుకోని కాకినాడ జేఎన్‌టీయు..!
రాష్ట్రంలో నకిలీ PhD సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నవారి జాబితా చాంతాడంత ఉందని టాక్. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏలూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరులోని కొన్ని కాలేజీల్లో ఇదే తంతు సాగుతోందని JNTU వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారట. కాలేజీల పేర్లు.. అధ్యాపకులుగా చెలామణి అవుతున్నవారు ఎవరో తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. ఈ అంశంపై JNTU అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి.. కొత్త వీసీ అయినా వీటిపై ఫోకస్ పెడతారో లేదో చూడాలి.