అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?
హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా?
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ పేరు బలంగా వినిపిస్తున్నా.. అధికారికంగా ప్రకటించలేదు. సురేఖ అయినా పోటీకి సిద్ధంగా ఉన్నారా అనేది క్లారిటీ లేదు. కేడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేతలు. పీసీసీకి కొత్త చీఫ్ వచ్చాక పార్టీ కార్యక్రమాల దూకుడు పెరిగింది. ఆ జోష్‌ను హుజురాబాద్ ఉపఎన్నికలకు ఎలా వాడుకోవాలో ఆలోచించేవాళ్లే లేరట. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారా లేదా అనేది అనుమానమేనట.
మధ్యలో వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకనే ఆలోచన..!
కాంగ్రెస్‌లో ఇదో అలవాటు. నామినేషన్ వేసేందుకు గంట ముందు వరకు.. అభ్యర్థిని ప్రకటించరు. పీసీసీ నివేదిక ఇవ్వాలి. ఏఐసీసీ ప్రకటన చేయాలి. ఇదంతా అయ్యేసరికి పార్టీలో లొల్లి కామన్. హుజురాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్లు అంతగా స్పందించడం లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు సైతం అంతే. సభలు.. సమావేశాల్లో ప్రతీదీ ప్రశ్నించే నాయకులు.. హుజురాబాద్ ఉపఎన్నికపై నోరు విప్పితే ఒట్టు. పైగా అంతా పీసీసీ చూసుకుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న సమయంలో.. అక్కడకు వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకే ఆలోచనలో పీసీసీ చీఫ్ ఉన్నట్టు సమాచారం.
పార్టీ కోసం ముందుకు రాని సీనియర్లు..!
హుజురాబద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి చూద్దాం అని సవాల్ విసిరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై.. రేవంత్ టీం సెటైర్స్ వేస్తున్నాయి. సొంత జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బాధ్యతలు తీసుకున్న గుర్రంపోడు మండలంలో TRSకే మెజారిటీ వచ్చింది.. దానికేం సమాధానం చెప్తారు అని కోమటిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నింటికీ తామే అని చెప్పే నాయకులు సైతం ..ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రాని పరిస్థితి.
అభ్యర్థి వేట కూడా వాయిదా..!
హుజురాబాద్‌లో దూకుడు ప్రదర్శించాలని మనసులో ఉన్నా.. దుబ్బాక లాంటి ఫలితం వస్తే లాభం కంటే.. నష్టం ఎక్కువ అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. బలం ఉండి.. కొట్లాడితే ఫర్వాలేదు. కానీ.. బలం లేనిచోట కొట్లాడకుండా.. పార్టీ కేడర్‌ను కాపాడుకుంటే చాలనే ఆలోచనలో నాయకులు ఉన్నారు. దీనికితోడు అభ్యర్థి వేట కూడా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి సారథి మారినా.. పార్టీలో పరిస్థితి మారలేదన్న ప్రచారమైతే జోరందుకుంది.