పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే.
శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!
కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!
స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ స్వీకారాలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత ఈ మధ్యే నామినేటెడ్ పదవుల భర్తీ చేశారు. వందల మందికి పదవులు దక్కాయి. ఆ జాబితాలోనే చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకూ పదవులు వచ్చాయి. అవి అలాంటి ఇలాంటి పదవులు కాదు.. దేశంలోనే ప్రముఖమైన శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాల చైర్మన్ పదవులు అవి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు దండిగా ఉన్న సత్యవేడు వైసీపీ నేత బీరేంద్రవర్మను కాళహస్తి ఆలయ చైర్మన్‌గా నియమించారు. అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత దయాసాగర్ రెడ్డి భార్యను కాణిపాకం వినాయకస్వామి ఆలయ చైర్మన్‌ను చేశారు. ఈ పదవుల జాబితా ప్రకటించగానే… బీరేంద్ర, దయాసాగర్ రెడ్డి.., వాళ్ల అనుచురలు ఎగిరి గంతేశారు. ఎంత భాగ్యం.. ఎంత అదృష్టమో అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఎక్కడి వాళ్లనో తెచ్చి ఇక్కడ పదవుల్లో ఇలా కూర్చోబెడతారని శ్రీకాళహస్తి, కాణిపాకం ప్రాంత నేతలు గట్టిగానే అడ్డంతిరిగారు. దీంతో హైకమాండ్ కూడా ఆలోచనలో పడింది. స్థానిక నేతలు లెవనెత్తింది సబబైన పాయింట్‌గానే పార్టీ పెద్దలకు అనిపించింది. అంతే ఆ నియామకాలను ఆపేశారు.
టీడీపీ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో బీరేంద్ర, దయాసాగర్‌లకు చోటు..!
పదవులు చేపట్టకుండా ఆపేశారే కానీ… వాళ్లిద్దరికి పదవీయోగం కల్సించాలన్న ఆలోచనను మాత్రం హైకమాండ్ పక్కన పెట్టలేదు. ఎలాగోలా వారిద్దర్నీ ఎక్కడో ఒకచోట అకామిడేట్ చేయాలని చూశారు. ఆ గుళ్ల చైర్మన్ పదవులు పోతే పోయాయి.. అంతకంటే పెద్ద పదవే ఇద్దామని టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో బీరేంద్ర, దయాసాగర్ పేర్లను చేర్చేశారు. మొదట ఇచ్చిన పదవులు ఆగితే ఆగాయి కానీ.. ఏకంగా దేవదేవుడికి దగ్గరగా సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సంబరపడిపోయారట ఆ నేతలిద్దరూ. ఇవాళో… రేపో పదవీ ప్రమాణం చేయాలని అనుకుంటున్న తరుణంలో పిడిగులాంటి వార్త వచ్చింది.
చేతిదాకా వచ్చిన పదవులు మళ్లీ ఆగాయి..!
దేవాదాయాశాఖ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ప్రత్యేక ఆహ్వానితుల జాబితా జీవోను ఏపీ హైకోర్టు నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. అంతే… ఆ ఇద్దరు ఉన్న ఆ జాబితా మొత్తం అమల్లోకి రాకుండానే ఆగిపోయింది. అప్పుడు ఇచ్చిన పదవులు స్థానిక నినాదంతో చేతిదాకా వచ్చి ఆగిపోతే.. ఇప్పుడు ఇచ్చిన పదవులు.. నిబంధనలకు వ్యతిరేకం అనే వివాదంతో ఆగిపోయాయి. అందుకే అందరూ… పాపం ఆ ఇద్దరు నేతలు… అంటూ సానుభూతి చూపిస్తున్నారట. ఐరన్ లెగ్ ఎవరిదో కానీ…. వాళ్లు చైర్మన్‌గా ఇచ్చిన పాకలమండళ్లు ఆగిపోయాయి… వాళ్లిద్దర్నీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన జాబితా కూడా ఆగిపోయింది.
ప్రత్యేక జాబితాలో కన్నయ్యకు చోటు దక్కినా.. ఫలితం లేదు..!
ఇది ఇంకో ఉద్యోగ సంఘం నేత కథ. గతంలోనే టీటీడీ సభ్యుడిగా పనిచేశారు రైల్వే యూనియన్ నాయకుడు కన్నయ్య. మరోదఫా కన్నయ్యను టీటీడీ బోర్డు సభ్యుడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ సిఫారసు చేశారు. కానీ.. అతనిపై రైల్వే విజిలెన్స్ శాఖ CBI ఎంక్వైరీ కోరడంతో రచ్చ అయింది. పాలకమండలి జాబితాలో కన్నయ్య పేరు చేర్చాలని అనుకున్నా.. ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడంతో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలోకి జారిపోయారు కన్నయ్య. ప్రస్తుతం ఈ ముగ్గురి గురించే ఇప్పుడు అధికారపార్టీ, ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.