ఎన్నికల్లో గెలిస్తే ఆ లెక్క వేరు. గెలిపించే సత్తా ఉంటే ట్రీట్‌మెంట్ ఇంకోలా ఉంటుంది. ఆ నాయకుడు ఈ రెండు కేటగిరీల్లోకి రాలేదో ఏమో.. ఆటలో బొప్పాయిలా మారిపోయానని ఆవేదన చెందుతున్నారట. పదవులు లభించినవారు వచ్చి కలుస్తుంటే… అభినందించి పంపుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎలాంటి పదవి దక్కలేదని ఎవరికీ చెప్పుకోలేక… నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం.
బొప్పనకు దక్కని నామినేటెడ్ పోస్ట్!
బొప్పన భవకుమార్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఎన్నికల్లో ఓడినా.. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంచార్జ్‌గా నియోజకవర్గంలో చక్రం తిప్పాలని అనుకున్నారు బొప్పన. కానీ… రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌ను తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌ను చేశారు పార్టీ పెద్దలు. పార్టీకి విధేయుడిగా ఉన్న బొప్పనకు వైసీపీ నగర అధ్యక్షుడిని చేసి ఊరట నిచ్చారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసినా.. నామినేటెడ్ పదవుల్లో కచ్చితంగా తనకు అవకాశం ఇస్తారని.. చేతిలో పదవి ఉంటే జనాల్లో కాస్త హుషారుగా తిరగొచ్చని అనుకున్నారట. కానీ.. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో బొప్పనకు ఛాన్స్ దక్కలేదు.
read also : ‘రోబో’తో బాలీవుడ్ బేబీ మరోసారి రొమాన్స్!
బొప్పనకు పదవి రాకుండా వ్యతిరేకవర్గం పావులు!
నామినేటెడ్ పదవుల ప్రకటనకు వారం ముందు నుంచీ పార్టీ వర్గాల్లో బొప్పన పేరుపై విపరీతమైన ప్రచారం జరిగింది. బెజవాడ వైసీపీ శ్రేణుల్లో హోరెత్తిపోయింది. హడావిడి చూసిన తర్వాత ఆయన కూడా ఫుల్ ఖుషీగా కనిపించారు. తీరా పేర్లు ప్రకటించిన తర్వాత బొప్పనతోపాటు.. ఆయన వర్గం డీలా పడింది. పార్టీలో తన వ్యతిరేకవర్గం పావులు కదపడం వల్లే నామినేటెడ్ పదవి రాలేదని అనుమానిస్తున్నారట బొప్పన. ఇదే విషయాన్ని సన్నిహితులు దగ్గర చెప్పి ఆవేదన చెందుతున్నారట.
బొప్పనకు పదవి ఇస్తే ‘తూర్పు’లో రెండు పవర్ సెంటర్లు!
వైసీపీ జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న కీలక నేత సైతం బొప్పనకు పదవి వస్తుందని నమ్మకంగా చెప్పారట. ప్రకటన తర్వాత ప్రశ్నిస్తే.. ఆయన పేరు మిస్ కావడానికి దారితీసిన కారణాలు చెబుతున్నారట. బెజవాడ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ బొప్పన వర్గమంతా తూర్పు నియోజకవర్గంలోనే ఉంది. ఇప్పుడు బొప్పనకు పదవి దక్కితే.. తూర్పులో రెండు పవర్ సెంటర్లు ఏర్పడతాయని అధిష్ఠానం ఆయన పేరును డ్రాప్ చేసిందని చెబుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవికన్నా నగర అధ్యక్ష పదవే ఎక్కువని తమను తామే ఓదార్చుకుంటున్నారు బొప్పన వర్గీయులు. అయితే తనకు పదవి రాకుండా అడ్డుపడ్డ పార్టీలోని అదృశ్య శక్తులు ఎవరో గుర్తించే పనిలో పడ్డారట బొప్పన.
పైకి అభినందనలు.. లోపల ఆవేదన!
ఇదే సమయంలో పుండుమీద కారం జల్లినట్టుగా బొప్పన పరిస్థితి మారిందట. పదవులు పొందినవారు వచ్చి బొప్పన ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు. అలా వచ్చిన వారిని ఆయన అభినందించి పంపుతున్నారు. మనసులో నామినేటెడ్ పోస్టు రాలేదన్న బాధ ఉన్నా.. అది బయటపకుండా పైకి నవ్వుతూ.. లోపల కుమిలిపోతూ నరకం అనుభవిస్తున్నాట బొప్పన. ఆటలో అరటిపండులా తమ నేత పరిస్థితి ఆటలో బొప్పాయిలా మారిందని అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారట.