పార్టీలలో వర్గపోరు సహజం. సమయం వచ్చినప్పుడు అది ఏ రూపంలో.. ఏ విధంగా బయట పడుతుందో చెప్పలేం. సందర్భాన్ని బట్టి అసంతృప్తి తీవ్రత ఉంటుంది. సమయం కోసం వేచి చూసేవాళ్లు ఛాన్స్ చిక్కితే అస్సలు వదలరు. ప్రస్తుతం ఆలేరు టీఆర్‌ఎస్‌లో అదే జరుగుతోందట.
ఆలేరు టీఆర్ఎస్‌లో రచ్చ!
యాదాద్రి జిల్లా ఆలేరులో సంస్థాగత ఎన్నికలు టీఆర్‌ఎస్ అంతర్గత విభేదాలను బయటపెట్టింది. తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్ష ఎంపిక అగ్గి రాజేసింది. ఎమ్మెల్యే గొంగిడి సునీత.. ఆమె భర్త, డీసీసీబీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి తీరుపై పార్టీలోని ఓ వర్గం భగ్గుమంది. వారిపై ఇప్పుడు వేటు వేయడంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఆలేరు చర్చగా మారింది.
శ్రీనివాస్ సహా ఆరుగురిపై ఎమ్మెల్యే వేటు!
తుర్కపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పడల శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని కాకుండా పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డిని నియమించడంతో శ్రీనివాస్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేందర్‌రెడ్డి కారుపై రాళ్లు పడ్డాయి. దాంతో పార్టీలో గుంభనంగా ఉన్న వర్గపోరు రోడ్డుకెక్కింది. భర్త కారుపై దాడిని ఎమ్మెల్యే గొంగిడి సునీత సీరియస్‌గా తీసుకున్నారు. రాళ్ల దాడికి శ్రీనివాస్ అండ్ కోనే కారణమని ఆరోపిస్తూ మొత్తం ఐదుగురిని ఆరేళ్లపాటు టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ చర్యే ఆలేరు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా దాడి చేసినవారిపై కేసు కూడా పెట్టారు.
రెండు వర్గాలకు ఎప్పటి నుంచో పడటం లేదా?
టీఆర్‌ఎస్‌లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే తన చర్యలతో హెచ్చరించినా.. దీని వెనక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నాయట పార్టీ వర్గాలు. వాస్తవానికి శ్రీనివాస్‌కు, ఎమ్మెల్యే సునీత వర్గాలకు ఎప్పటి నుంచో పడటం లేదట.
అవి ఇప్పుడు పార్టీ కమిటీ ఏర్పాటు రూపంలో బయటపడ్డాయట. ఇదే అవకాశం అనుకున్నారో.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదని భావించారో ఏమో.. పార్టీ నుంచి వేటు వేయడం.. కేసు పెట్టడం చకచకా జరిగిపోయింది.
పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే పనిలో శ్రీనివాస్ వర్గం!
పది రోజుల క్రితం వంగపల్లిలో జరిగిన టీఆర్ఎస్ మీటింగ్‌లోనూ ఎమ్మెల్యే సునీత చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో కోవర్టులు ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నారో అని నాడు పార్టీ వర్గాలు ఆరా తీశాయి. ఇప్పుడు గొడవలు ఇలా టర్న్ తీసుకోవడంతో.. ఆ కామెంట్స్‌కు.. తాజా రగడకు సంబంధం ఉందని అనుకుంటున్నాయట పార్టీ శ్రేణులు. ప్రస్తుతం రెండు వర్గాలు పోటాపోటీ సమావేశాలు నిర్వహించి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని.. టీఆర్‌ఎస్ పెద్దల దృష్టి తీసుకెళ్తామని శ్రీనివాస్ వర్గం హెచ్చరిస్తోంది. తుర్కపల్లి ఘటనపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రెండు వర్గాలు ఫిర్యాదు చేసుకున్న తర్వాత ఈ వర్గపోరు ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఆలేరు అధికారపార్టీలో ఆసక్తిగా మారింది.