నందికొట్కూరు వైసీపీ గురించి చెబితే.. అక్కడి నాయకుల కంటే.. వారి మధ్య ఆధిపత్యపోరే ఎక్కువ హైలెట్. ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పు నిప్పులా ఉంటారు. వారే కాదు.. వారి అనుచరులు కూడా అంతే. ఇప్పుడు కొత్త గొడవ ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్..!
ఆధిపత్యపోరులో దాడులు.. హత్యాయత్నాలు..!
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య 2019 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అస్సలు పడటం లేదు. అనేకసార్లు అధిష్ఠానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నియోజకవర్గంలో ఇరువురి మధ్య అధిపత్యపోరు ముదిరి ఒకవర్గంపై మరోవర్గం దాడులు.. హత్యాయత్నంల వరకు దారితీశాయి. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఒకవర్గంపై మరోవర్గం పోటీ చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితి..!
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్థర్ మధ్య వర్గపోరును నివారించేందుకు వైసీపీ జిల్లా ఇంచార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వారి మధ్య సయోధ్య సాధ్యం కాకపోగా తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతగా నందికొట్కూరు వైసీపీలో సమస్యలు రచ్చ రచ్చగా మారి చర్చకు దారితీస్తున్నాయి. పరస్పరం కేసులు పెట్టుకోవడం పోలీస్ వర్గాలకు కూడా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. అభివృద్ధి పనుల్లోనూ అధికారులు రెండువర్గాలను సమన్వయం చేయలేక సతమతం అవుతున్నారట.
మరింత గ్యాప్ తీసుకొచ్చిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం..!
శాప్ చైర్మన్ హోదాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్‌కు ఆహ్వానం లేదు. చివరకు ఎమ్మెల్యే పేరు కూడా శిలాఫలకంపై లేకపోవడం చర్చకు దారితీసింది. అదే శిలాఫలకంలో మున్సిపల్ అధికారులు పేర్లు ఉన్నాయట. ఈ అంశంపై ఆర్థర్ వర్గీయులు నిలదీశారు. దీంతో అధికారుల పేర్లు కనించకుండా ఇటుకలు పెట్టి మూసివేశారు. అంతేకాదు.. ఈ గొడవ తమకెందుకని ట్యాంక్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండిపోయారు అధికారులు. మరోవైపు ప్రొటోకాల్ ఉల్లంఘించి.. అవమానించారని ప్రివిలేజ్ కమిటీకి, ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే ఆర్థర్‌పై ఆయన వర్గీయులు ఒత్తిడి తెచ్చారట. ఎమ్మెల్యే మాత్రం ఈ అంశాన్ని వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారట.
సహించలేరు.. రాజీ పడరు..!
ఎంత చెప్పినా ఇద్దరూ వినకపోవడంతో హైకమాండ్ నిస్తేజంగా మారిపోయిందట. సిద్ధార్థరెడ్డి మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. ఆర్థర్ పోలీస్ అధికారిగా రిటైర్ అయి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం కావడంతో సిద్ధార్థరెడ్డికి ఛాన్స్ లేదు. ఆర్థర్ మాత్రం మాత్రం ఎమ్మెల్యేగా తన పని తాను చేసుకుపోతాను అంటున్నా.. అది సిద్ధార్థరెడ్డి సహించలేకపోవడం.. ఆర్థర్ రాజీ పడకపోవడంతోనే సమస్యలు శ్రుతి మించుతున్నాయట. ఇది ఎవరికి చేటు తెస్తుందో చూడాలి.