రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే.. అవినీతి అధికారులకు కాసులు కురిపించే ముడిసరుకు. కాసేపు కళ్లు మూసుకుంటే చాలు.. చాలా మంది జేబులు నిండిపోతాయి. ఇది ప్రతి జిల్లాలో ఉండే బాగోతమే..! ఆ జిల్లాలో మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉందట అవినీతి అధికారుల తీరు.
పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోకుండా డబ్బులతో మేనేజ్..?
పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే PDS బియ్యాన్ని అక్రమ మార్గాల్లో మాఫియా తరలిస్తుందన్నది ఓపెన్ టాక్. కేజీ 31 రూపాయలకు ప్రభుత్వం కొని.. పేదలకు కేజీ ఒక రూపాయికి అందిస్తున్న ఈ బియ్యాన్ని మాఫియా పక్కదారి పట్టిస్తోంది. ఎక్కువ లాభాలకు అమ్మేసుకుని సొంత జేబులు నింపుకొంటున్న నేతలు, అవినీతి అధికారులు ఎందరో. రాత్రికి రాత్రి బియ్యాన్ని కాకినాడ పోర్ట్ ద్వారా ఆఫ్రికా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు పంపేస్తున్నారు. చెక్‌పోస్టుల దగ్గర బియ్యాన్ని పట్టుకోకుండా డబ్బులతో మెనేజ్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువైంది.
పక్కదారి పడుతోన్న 80 వేల టన్నుల పీడీఎస్ బియ్యం..?
తూ.గో.జిల్లాలోని రైస్‌మిల్లర్లకు ఎక్కువ ధరకు విక్రయం..!
ఏపీలో ఒక కోటీ 48 లక్షల రేషన్ కార్డులుంటే.. వీటిలో 80 లక్షల కార్డుదారులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేజీ ఒక రూపాయి బియ్యాన్ని అందిస్తున్నారు. ప్రతినెలా సరాసరి ఒక లక్షా 92 వేల టన్నుల PDS బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నట్టు లెక్కల్లో ఉంటోంది. కానీ.. ఆ మొత్తంలో 80 వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. పీడీఎస్ బియ్యాన్ని ఈ విధంగా అక్రమంగా రవాణా చేయడంలో పశ్చిమగోదావరి జిల్లాలో అవినీతి అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు. జిల్లాలోకి తెలంగాణ నుంచి కూడా పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం లారీల్లో దిగుమతి అవుతోంది. దీనికితోడు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో లబ్ధిదారుల దగ్గర తక్కువ ధరకు బియ్యాన్ని కొని గుట్టుగా తూర్పుగోదావరిజిల్లాలోని రైస్ మిల్లులకు తరలించి.. ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చెక్‌పోస్టుల్లో పట్టుకోకుండా బియ్యం లారీలకు గ్రీన్‌చానల్!
తెలంగాణ నుంచి జంగారెడ్డిగూడెం, కన్నాపురం, ద్వారకా తిరుమల, కామవరపు కోట, నల్లజర్ల ప్రాంతాల మీదుగా వస్తున్న పీడీఎస్ బియ్యాన్ని జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, ఏలూరు రూరల్, కొత్తూరు ప్రాంతాల్లోని చెక్‌పోస్ట్‌లో ఎందుకు పట్టుకోవడం లేదన్నదే ప్రశ్న. పౌరసరఫరాలు, రెవెన్యూ, రవాణా, పోలీస్, విజిలెన్స్ విభాగాల్లోని అవినీతి అధికారులు ఒక ముఠాగా ఏర్పడి.. పీడీఎస్ బియ్యాన్ని తరలించే లారీలకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేస్తున్నారట. రేషన్ బియ్యం మాఫియా చెప్పినదానికి అవినీతి అధికారులు జవదాటరని టాక్. ఈ అంశంపై విమర్శలు వస్తున్నా పైవాళ్ల అండ ఉండటంతో.. ఇంటి దొంగలను పట్టుకోలేకపోతున్నారట. ఈ విభాగాలలో పనిచేస్తున్న కొందరు ఇప్పటికే కోట్లకు పడగలెత్తినట్టు సమాచారం. వారెవరో.. ఏం చేస్తారో తెలిసినా.. చర్యలు తీసుకునే సాహసం.. ధైర్యం ఎవరికీ లేదని ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారట. ప్రస్తుతం ఈ ప్రభుత్వ విభాగాల్లోని అవినీతిపరుల గురించే ఉద్యోగ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.