భూపాలపల్లి అధికారపార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? అధిష్ఠానం ఒకటి ఆలోచిస్తే.. ఆ ఇద్దరు నేతలు ఆధిపత్యపోరుతో మరొకటి చేస్తున్నారా? సమస్య ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. గల్లా పట్టుకోవడానికే రెండు వర్గాలు ప్రాధాన్యం ఇస్తున్నాయా?
రెండు వర్గాల మధ్య గొడవలే..!
2018 ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు.. భూపాలపల్లి నియోజకవర్గంలోని గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి తర్వాత గులాబీ కండువా కప్పుకొన్నారు. గండ్రపై పోటీ చేసిన అధికారపార్టీ అభ్యర్థి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. తర్వాత జరిగిన జంపింగ్‌లు సహజంగానే మధుసూదనాచారి వర్గానికి ఇబ్బంది కలిగించాయి. అప్పటి నుంచి రెండు వర్గాలు కలిసి సాగింది లేదు. స్వపక్షంలోనే విపక్షంగా కలహించుకుంటున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధుసూదనాచారి ఎమ్మెల్సీ అయినప్పటికీ.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. దీంతో గండ్ర, చారి వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వేదిక ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా పంతా నీదా నాదా అన్నట్టు ఉంది వీళ్ల రాజకీయం.
పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత
తాజాగా భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. శిలాఫలకంపై తమ నేత పేరు లేదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గీయులు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే గండ్ర ఒత్తిడి వల్లే శిలాఫలకంపై ఎమ్మెల్సీ పేరు చేర్చలేదని నినాదాలు చేశారు. దానికి అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గం కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించింది. రెండు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుంటేకానీ.. పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఇద్దరు నేతల తీరుపై పార్టీ పెద్దలు అసహనం?
వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండాను రెపరెపలాడించేందుకు పార్టీ పెద్దలు దృష్టిపెట్టారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని సింగరేణి కార్మికుల ఓట్లపై గురిపెట్టింది అధికారపార్టీ. అందుకోసమే నియోజకవర్గంలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే.. రెండు వర్గాలు అధిపత్యపోరుకు దిగడం చర్చగా మారింది. విపక్షాల వలకు కార్మికులు చిక్కకుండా TBGKS పరిధిలో చర్యలు తీసుకుంటుంటే.. నేతల మధ్య ఇదేం గొడవ అని పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ ఏడాదే ఎన్నికలు.. నేతలు కుస్తీ..!
దాదాపు 18వేల మంది యువ కార్మికులను ఆకర్షించాలనేది TBGKS లక్ష్యం. ఇందుకోసం ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు హోదాలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం వ్యూహాన్ని పసిగట్టలేదో ఏమో.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కుస్తీకి దిగడంతో సమస్య రోడ్డెక్కేసింది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఇద్దరు కీలక నాయకులు ఈ విధంగా రచ్చ చేయడంతో కేడర్ ఆందోళన చెందుతోందట. మరి.. ఇద్దరు ప్రజాప్రతినిధుల విషయంలో అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.