ఎంపీ కేశినేని నాని టీడీపీ హైకమాండ్‌కు వార్నింగ్ ఇచ్చారా? వచ్చే ఎన్నికల్లో తానేం చేయబోతున్నానో క్లియర్‌గా చెప్పేశారా? సొంత పార్టీలోని ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని నాని చేసిన కామెంట్స్‌తో వార్ మొదలైనట్టేనా? ఇంతకీ ఎంపీ కేశినేని నాని ఎందుకు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు? ఆయన గురి ఎవరిపైన?
టీడీపీ పెద్దలకు సైతం నాని లెఫ్ట్ అండ్ రైట్..?
బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఎన్నికలు సమీపించే వేళ వార్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే నాని ప్రిపేర్ అవుతున్న యుద్ధం వైసీపీ మీద కాదు. సొంత పార్టీపైనా.. సొంత పార్టీ అధినాయకత్వంపైనే. కొంతకాలంగా పార్టీ హైకమాండ్‌తో టచ్ మీ నాట్‌గా ఉంటున్న కేశినేని నాని సందర్భం వచ్చిన ప్రతీసారీ ఏదోక కామెంట్ చేయడం.. తన చుట్టూ రాజకీయాన్ని తిప్పుకోవడం చేస్తున్నారు. లేటెస్ట్‌గా పార్టీలో తన వ్యతిరేకవర్గంతో జతకట్టే వారినే కాకుండా.. ఏకంగా పార్టీ పెద్దలకు సైతం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఇది నానికి అలవాటైన వ్యవహరమే అయినప్పటికీ ఈ దాడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే క్రమంలో తన నోటికి ఇంకా ఎక్కువుగా పని చెప్పాలని ఈ విజయవాడ ఎంపీ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల వాదన.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ నానికి వ్యతిరేకవర్గం ఉంది
నాని ఈ విధంగా ఎందుకు టీడీపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసుకున్నారనే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. కొన్ని రోజులుగా బెజవాడ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పరిణామాలే. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ నానికి వ్యతిరేకులు తయారయ్యారు. ఒకప్పుడు ఎంపీకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లంతా ఇప్పుడు నాని పేరు చెబితే కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి. తన సోదరుడు కేశినేని చిన్నీని పార్టీ అధినాయకత్వమే ప్రోత్సహిస్తోందని నాని ఫీలవుతున్నారు. చిన్ని బెజవాడ ఎంపీ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తూనే తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని చేరదీస్తున్నారని ఫైర్ అవుతున్నారు నాని.
తన వ్యతిరేకులకు పార్టీ పెద్దలు సహకరిస్తున్నారని ఎంపీ సందేహం
ఈ పరిణామాలకు తోడు కేశినేని నానికి ఝలక్ ఇచ్చేందుకా అన్నట్టు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతానని బుద్దా వెంకన్న ప్రకటించారు. ఈ వరుస పరిణామాలు నానికి మంట పుట్టిస్తున్నాయట. బెజవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ పరంగా ఉన్న లోపాలను.. అసంతృప్తిని కంట్రోల్ చేసి.. తనకు అండగా ఉండాల్సిన అధినాయకత్వం.. దానికి భిన్నంగా వెళ్తోందనే అభిప్రాయంలో నాని ఉన్నారట. గడచిన ఎన్నికల్లో ఫ్యాన్ హవా విపరీతంగా ఉన్నప్పటికీ.. తన సొంత ఇమేజ్‌తోనే తిరిగి ఎంపీగా గెలిచాననేది కేశినేని నాని భావన. ఆ విషయాన్ని అధిష్ఠానం గుర్తించకపోగా.. తన వ్యతిరేకులకు తెరవెనుక పార్టీ పెద్దలే సహకరిస్తున్నారని ఎంపీ సందేహిస్తున్నారు. దీంతో పార్టీలోని వ్యతిరేకులనే కాకుండా నేరుగా టీడీపీ హైకమాండ్‌ను ఢీకొంటున్నారు.
తమ్ముడు చిన్నితోపాటు టీడీపీ అధిష్ఠానానికి నాని చురకలు
ఆ ప్రక్రియలో భాగంగానే అధిష్ఠానాన్ని.. పార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని కేశినేని నాని వార్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల దేవినేని ఉమను టార్గెట్ చేసుకుని మైలవరంలో కామెంట్స్ చేశారు. ఆ వేడి తగ్గక ముందే.. అంతకుమించి అన్నట్టు నందిగామలో ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు నాని. తన తమ్ముడు చిన్నితోపాటు.. ఏకంగా టీడీపీ అధిష్ఠానానికి చురకలంటించారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చంటూనే ల్యాండ్ గ్రాబర్లు.. చీటర్లకు టికెట్స్ ఇస్తే టీడీపీకే నష్టమని చెప్పారు. అంతటితో ఆగకుండా తన తమ్ముడికి టిక్కెట్ ఇస్తే.. కచ్చితంగా తాను సహకరించేదే లేదని తెగేసి చెప్పేశారు నాని. తన తమ్ముడు చిన్నికే కాదు.. టీడీపీలో మరో ముగ్గురు.. నలుగురున్నారని.. వారికి టికెట్ ఇచ్చినా సహకరించబోనని కుండబద్దలు కొట్టేశారు. కేశినేని నాని చేసిన ఈ కామెంట్స్ పార్టీలోని ప్రత్యర్థులకే కాకుండా టీడీపీ అధిష్ఠానానికి కూడా వర్తిస్తాయనే చర్చ సాగుతోంది. కొందరైతే నాని నేరుగా టీడీపీ హైకమాండ్‌కే వార్నింగ్ ఇచ్చారని అభిప్రాయ పడుతున్నారు. నాని దృష్టిలో అధిష్ఠానం గాడి తప్పింది. మరి.. టీడీపీ పెద్దలు ఎంపీ కేశినేని నాని కామెంట్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.