రాజకీయాల్లోకి వచ్చాక లోక్‌సభకే పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి.. వచ్చే ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలో ఉంటారా? బీజేపీ ఆలోచనలు.. కదలికలు ఆ సంకేతాలను బలపరుస్తున్నాయా? ఒకవేళ అదే బీజేపీ నిర్ణయమైతే పురందేశ్వరి ఎక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు? బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తారా?
తాను తన కొడుకు రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ ఆగలేదు. తాజాగా ఆ కుటుంబానికి సంబంధించి మరో సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. అదీ ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని బీజేపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఒంగోలునే ఎందుకు ఎంచుకుంటోంది? ఒంగోలులో పురందేశ్వరిని పోటీ చేయించడం ద్వారా బీజేపీ ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏంటి? లోక్‌సభకు కాకుండా అసెంబ్లీకే పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే పురందేశ్వరి ఏం చేస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నాలుగుసార్లు లోక్‌సభకు పోటీ
పురందేశ్వరి రాజకీయాల్లోకి వచ్చాక అసెంబ్లీకి పోటీ చేసింది లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. బీజేపీలో చేరిన తర్వాత లోక్‌సభకే పోటీ చేశారు. 2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు పురందేశ్వరి. గెలిచిన రెండుసార్లు UPA ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరుణంలో బీజేపీలో చేరిన పురందేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో మరోసారి విశాఖలో సై అన్నప్పటికీ కలిసి రాలేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం.. పనితీరు.. NTR కుమార్తె కావడం.. సామాజికవర్గం ప్లస్ అయ్యి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది బీజేపీ. ఇటీవల ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీ బీజేపీలోని కీలక నేతలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 2024 లేదా అంతకంటే ముందే ఏపీలో ఎన్నికలు వస్తే పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా ప్రణాళిక ఇచ్చిందట హైకమాండ్. అందులో భాగంగానే పురందేశ్వరిని అసెంబ్లీకి పోటీ చేయించాలనే చర్చ వచ్చిందట.
టీడీపీ ఓటు బ్యాంకు చీలుస్తారా?
పురందేశ్వరి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమెకు ఆమె కుటుంబానికి ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని బీజేపీ పెద్దలు లెక్కలేశారట. ఎన్టీఆర్ వారసురాలిగా పురందేశ్వరి టీడీపీ ఓటు బ్యాంకును చీల్చి సక్సెస్ అవుతారని కూడా అనుకుంటున్నారట. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బలంగా ఉన్నప్పటకీ.. పురందేశ్వరి బరిలో ఉంటే సమీకరణాలు మారతాయని ఆశిస్తున్నారట. ప్రస్తుత రాజకీయాల నుంచి తాను తన కుమారుడు హితేష్ తప్పుకొంటున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పురందేశ్వరి ఒక్కరే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటారని ఆయన చెప్పారు. మొన్నటి వరకు భర్త అసెంబ్లీకి, భార్య లోక్‌సభకు పోటీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలాగూ ఆయన తప్పుకోవడంతో పురందేశ్వరికి లైన్ క్లియరైనట్టేనని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
2019లో ఒంగోలులో బీజేపీకి వచ్చిన ఓట్లు 693
అయితే ఒంగోలులో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 693. మరి.. సొంత సామాజికవర్గం ఓట్లు.. ఎన్టీఆర్ కుమార్తె అన్న సెంటిమెంట్ ఒంగోలులో బీజేపీకి ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది ప్రశ్న. పైగా లోక్‌సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడానికి పురందేశ్వరి అంగీకరిస్తారా అనే మరో సందేహం పార్టీ వర్గాల్లో ఉందట.