ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉందా? మరీ… నోట్లో నాలుక లేని వ్యక్తిని ఇన్ఛార్జ్‌గా పెట్టి పార్టీ అధిష్టానం చేతులు కాల్చుకుంటోందా? మేటర్ ఏదైనా సరే… పలాయనమే ఆ ఇన్ఛార్జ్‌కు తెలిసిన ఏకైక పరిష్కారమా? ఎవరా నాయకుడు? ఏంటా ఫెయిల్యూర్ స్టోరీ? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దద్దాల నారాయణ యాదవ్ ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ…పార్టీ శ్రేణులను సమన్వయం చేయటం మాత్రం ఆయన వల్ల కావడం లేదన్నది కేడర్ అభిప్రాయం.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా… నారాయణను మాత్రం ఇంకా గతంలో ఆయన పనిచేసిన జడ్పీటీసీగానే ట్రీట్ చేస్తున్నారట కనిగిరి లీడర్స్, కేడర్. స్వతహాగా సౌమ్యుడని పేరున్న నారాయణ… గట్టిగా ఎవరికీ చెప్పలేక కొన్ని సందర్భాల్లో పలాయన మంత్రం జపిస్తున్నారని, గ్రామస్థాయి వర్గ రాజకీయాలను కూడా పరిష్కరించలేకపోతున్నారన్నది పార్టీ వాయిస్. కనిగిరి టౌన్ లో ఉండే పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేసి ఎక్కడో ఊరి చివరన ఉన్న తన ఫాంహౌస్‌కు మార్చటం వెనుక కారణం కూడా గట్టిగా మాట్లాడలేక పోవటమేనట. అద్దె భవనంలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి రావటం.. పార్టీ నేతలు కలిసి రాకపోవటం వల్ల మార్పు తప్పలేదంటున్నారు. టైన్‌లో ఆఫీస్ ఉంటే అందరికీ అందుబాటులో ఉండేదని, ఇప్పుడు ఫాంహౌస్‌లో పెట్టడం వల్ల సొంత పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు వెళ్లలేకపోతున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు తప్ప నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ యాక్టివ్‌గా ఉండటం లేదట. కనిగిరి నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన నారాయణకు అదే స్దాయిలో ఓటు బ్యాంక్ ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అదనపు బలమైనా గెలుపు సాధ్యం కాలేదు. తగినంత అర్ద, అంగబలం లేకపోవడమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గంగా కలిసి పనిచేసిన పలువురు నియోజకవర్గ కీలక నేతలను ఆ తర్వాత సమన్వయం చేసుకోలేక పోవటం కూడా నారాయణకు మైనస్ అవుతోందట. పార్టీ కేడర్ కు విడి సమాయాల్లో దొరికే ఇన్ఛార్జ్ వారికి ఏదన్నా అవసరం ఉండి కాల్ చేస్తే మాత్రం నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉండరని అంటున్నారు. పార్టీలోని కీలక నేతలు తన మాట వినరు అనే సందర్బాల్లో నొప్పింపక.. తానొవ్వక.. అన్న పద్యాన్ని గుర్తు చేసుకుంటారంటారు. మరోవైపు నారాయణ రాజకీయ ఆరంగ్రేటం చేసిన రోజుల్లో బీసీ ఐక్యవేదికను ఏర్పాటు చేసి… ప్రధాన కులాలను టార్గెట్ చేసుకుని మాట్లాడటాన్ని నియోజకవర్గ ఓటర్లు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారన్నది ఇంకో వెర్షన్.సొంత సామాజికవర్గంపై నారాయణకు పట్టు లేకపోవటం, వైసీపీకి సపోర్ట్ చేసే ప్రధాన సామాజికవర్గాల నేతలు ఆయనతో కలసి రాకపోవటం కూడా మైనస్ అయి నియోజకవర్గంలో వైసీపీ కేడర్ మరింత అయోమయంలో పడుతోందని అంటున్నారు.
వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టడం వెన కొన్ని కారణాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కార్యకర్తలు, నేతలు ఆశించిన స్దాయిలో రాకపోతే కార్యక్రమం తేలిపోతుందని.. దానికి బదులు తానే వెళ్ళకుంటే.. ప్రోగ్రామ్ ఎలా జరిగినా ఏదో ఒకటి చెప్పుకోవచ్చన్న లెక్కలు ఉండి ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా కనిగిరి వైసీపీలో అయోమయం.. గందరగోళం పెరుగుతున్న క్రమంలో… ఇన్ఛార్జ్‌ని మారుస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గత ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీ చేసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ తిరిగి ఇక్కడకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, వైఎం ప్రసాదరెడ్డి వంటి కీలక నేతలు ఆయనకు ప్రత్యామ్నామంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానాలున్నాయి వైసీపీ కేడర్‌లో. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను ఇప్పటికే మార్చిన, మారుస్తున్న క్రమంలో కనిగిరి అయోమయానికి అధిష్టానం ఏం మందు వేస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పార్టీ నాయకులు.