ఓరుగల్లు కాంగ్రెస్ పోరు కొత్త టర్న్ తీసుకోబోతోందా? ఇద్దరినీ పిలిచారు…రెండు పక్షాల వాదన విన్నారు…. కానీ, నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక్కరితోనే చర్చించారంటూ కొండా వ్యతిరేకులు మండి పడుతున్నారా? ఏకంగా క్రమశిక్షణ కమిటీ పని తీరునే ప్రశ్నిస్తున్నారా? ఇంతకీ కొత్తగా జరిగిన మార్పు ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంత నారాజ్ అయ్యారు?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఓరుగల్లు పోరు ముగిసినట్టే ముగిసి… మళ్ళీ రాజుకుందా అంటే… వాతావరణం అలాగే ఉందని అంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఆ విషయంలో అధిష్టానం అనుసరించిన వైఖరి కూడా కారణం కావచ్చంటున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తూ… తీవ్ర అసహనంగా ఉందట ఆయన వ్యతిరేక వర్గం. దీంతో లొల్లి ముగిసిపోతుందని అనుకుంటే… మళ్ళీ అంటుకుంది ఏంట్రా నాయనా… అంటూ కేడర్ తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. స్థానిక కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆ మధ్య కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దానికి సంబంధించి వివరణ ఇవ్వమంటూ కొండాకు నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ.
ఆయన్ని గాంధీభవన్‌కు పిలిచి వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత మురళి వ్యతిరేక శిబిరాన్ని కూడా పిలిచి మాట్లాడారు. తమను ఉద్దేశించి మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారట జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు. ఓ దశలో కొండా మురళి కావాలో… మేం కావాలో తేల్చుకోండని పార్టీ పెద్దలకు అని అల్టిమేటం ఇవ్వడంతో అప్పటికి అది వాయిదా పడింది. తిరిగి తాజాగా… హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన క్రమశిక్షణ కమిటి సమావేశానికి వెళ్ళారు కొండా. దాదాపు గంటన్నర పాటు మీటింగ్ జరగ్గా…. ఇక ముందు అలాంటివి రిపీట్ అవకుండా జాగ్రత్త పడతానని కొండా… కమిటీకి చెప్పారట. ఆ సమాధానానికి క్రమశిక్షణ కమిటి చైర్మన్ మల్లు రవి సంతృప్తి చెందినట్టు తెలిసింది. అందుకే ఆ ఎపిసోడ్‌కు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అయితే… ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. కొండా మురళిని మళ్ళీ పిలుస్తున్నట్టుగాని, ఆయన వివరణ తీసుకుంటున్నట్టుగాని తమకు కనీస సమాచారం ఇవ్వలేదని మండుపడుతోందట ఆయన వ్యతిరేక శిబిరం.
ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు ఫిర్యాదుదారులతో కనీసం మాట్లాడకుండా… ఒకవైపు వెర్షన్ తీసుకుని క్రమశిక్షణ కమిటీ ఎలా వదిలేస్తుందని పార్టీ పెద్దల్ని గట్టిగా అడుగుతున్నారట వరంగల్ కాంగ్రెస్ నాయకులు. రిపీట్ చేయబోనని ఆయన చెప్పారుసరే…. రేపు ఒకవేళ రిపీట్ అయితే బాధ్యులు ఎవరు..? కొండా మురళికి ఇచ్చిన ఆప్షనే… మాక్కూడా ఇస్తారా అని ముఖ్య నాయకుల్ని నిలదీస్తున్నట్టు సమాచారం. కమిటీ కనీసం జిల్లా నేతల్ని పిలిచి…. జరిగిన అంశాన్ని వివరించి ఉన్నా బాగుండేదన్నది వాళ్ళ అభిప్రాయం. క్రమశిక్షణ కమిటీ కనీసం ఈ పని కూడా చేయలేదనే నారాజ్ ఎక్కువైందట వాళ్ళలో. అంటే కాంగ్రెస్ పార్టీలో న్యాయం ఏకపక్షంగా ఉంటుందా అని నిష్టురంగా అడుగుతున్నారట వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. దీంతో… వాళ్ళ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.