చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు స్పేస్ లేకుండా పోయింది. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది…? పార్టీ తరపున బీసీలకు రిజర్వేషన్ ని ఇస్తారా..? మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే వ్యూహమా? బీసీలకు జనాభా ప్రకారం అన్నిట్లో వాటా ఇస్తామని ప్రకటిస్తూ వచ్చింది కాంగ్రెస్. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కోర్టులో పరిగణలోకి రాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కోర్టులో ఉండడంతో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని భావిస్తుంది. దాంట్లో భాగంగానే బీసీ అభ్యర్థుల ఎంపిక చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సహజంగా రూరల్ లో జనాభా ప్రతిపాదన చూస్తే ఒకరకంగా… మున్సిపాలిటీలలో జనాభా చూస్తే మరోరకంగా ఉంటుంది. దీంట్లో బీసీలకు సాధారణంగా ఇచ్చే రిజర్వేషన్ల కంటే ఎక్కువ సీట్లు దకే అవకాశం కూడా ఉంటుందనేది అధికార పార్టీ అంచనా. మున్సిపాలిటీలలో సాధారణంగా ఇచ్చే రిజర్వేషన్ల కంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. మున్సిపాలిటీలలో కూడా చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వాలని లెక్కలు వేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వపరంగా సర్వేలు చేయడం… జీవోలు తేవడం లాంటి అంశాలు అనుకూలమైనా…అది చట్టబద్ధంగా కల్పించడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ పరంగానే మున్సిపాలిటీల్లోని వార్డుల్లో… మున్సిపల్ చైర్మన్ లలో కూడా 42శాతం బీసీలకు కేటాయించాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీ నినాదం కొంత వర్కౌట్ అయిందని పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని అమలు పరచాలని చూస్తోంది. బీసీలకు పార్టీ చెప్పినట్టుగా 42శాతం సీట్లను కేటాయించాలని డిసైడ్ అయినట్టు కనపడుతోంది. అందుకు అనుగుణంగా జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు కూడా అభ్యర్థుల ఎంపిక జరగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.