తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో… నామ్‌కే వాస్తే… పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా… ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతోంది? ఎవరెవర్ని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చూపాలి, ఉనికి చాటుకోవాల్సిందేనన్నట్టుగా ఉందట వ్యవహారం. అందులో భాగంగానే… రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. జిల్లా స్థాయిలో కూడా పూర్తయ్యాయి. ఇక ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇన్చార్జ్‌లను, కన్వీనర్స్‌ను నియమిస్తోంది.
మండల ఇన్చార్జ్‌లు, కన్వీనర్స్ నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే… ఇన్ఛార్జ్‌లు, కన్వీనర్స్ లోకల్‌బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ చేయరు. కేవలం ఎన్నికల సమన్వయం కోసం పని చేస్తారు. టాప్ టు బాటమ్ ఇలా జరుగుతున్న కసరత్తు చూస్తుంటే…ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాషాయ పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. అలాగే….అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట కమలనాథులు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో మెజారిటీ స్థానాలు గెలిపించుకోవాల్సిందేనని టార్గెట్ పెట్టినట్టు సమాచారం.
ఎలాంటి వ్యూహాలు రచిస్తారో, ఏం చేస్తారో చేయండి. ఫైనల్‌గా రిజల్ట్ మాత్రం కనిపించాలంటూ ఆయా నియోజకవర్గాల పరిధిలో గెలుపు బాధ్యతను వాళ్ళ భుజాన్నే పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలమైన అభ్యర్థులను బరిలో దింపితేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో… పెద్ద తలకాయల్నే పోటీకి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ అడిగి దక్కించుకోలేకపోయిన వారితో ఇప్పుడు జడ్పీటీసీలుగా పోటీ చేయించాలని నిర్ణయించిందట కాషాయపార్టీ అధి నాయకత్వం. రిజర్వేషన్స్‌కు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఆ దిశగా ఇప్పటికే కొందరికి పార్టీ ఇంచార్జ్‌లు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. పోటీకి సిద్ధంగా ఉండాలని, ఒక వేళ జడ్పీటీసీగా ఓడితే రేపు ఎమ్మెల్యే టికెట్ రాదేమోనని భయపడవద్దని కూడా భరోసా ఇస్తున్నారట. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నట్టు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన సంజయ్, ఈటల, అరవింద్, రఘునందన్ రావు ఓడిపోయినా… తిరిగి వాళ్ళకు ఎంపీ టిక్కెట్స్ దక్కాయి కదా…. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వర్తిస్తుందని హామీ ఇస్తున్నారట. జిల్లా పరిషత్ ఛైర్మన్స్ రిజర్వేషన్లనుబట్టి ఆ జిల్లాలో ఉన్న పార్టీ పెద్ద తలకాయల్ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మున్సిపాలిటీల విషయంలో కూడా ఇదే వైఖరి ఉంటుందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమైన నాయకులు పోటీ చేయడం వల్ల ఆయా జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది తెలంగాణ బీజేపీ లెక్కగా తెలుస్తోంది. ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన నాయకులు జడ్పీటీసీలుగా పోటీకి అంగీకరిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.