నా లిమిట్స్‌లో నువ్వు వ్యాపారం చేసుకోవాలా? అయితే కప్పం కట్టాల్సిందే, చెప్పినంత సమర్పించుకోవాల్సిందే. సొంత పార్టీ వాళ్ళయినా సరే… ఇందులో సీజనల్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఏమీ ఉండవంటూ కరాఖండీగా చెప్పేస్తున్నారట ఆ ఎమ్మెల్యే కమ్ ఎక్స్ మినిస్టర్. ఆయన పార్టీ మారినా పైసా వసూల్ పద్ధతి మాత్రం మారలేదట. ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? సొంతోళ్ళ దగ్గరే ఎలా గుంజుతున్నాడు? ఏపీలో కూటమి ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందోగానీ…. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు…. పదేపదే హెచ్చరిస్తున్నా, ఆశించిన మార్పు మాత్రం కనిపించడం లేదు. తెగించేశారో…. లేక ఆ…. ఆయన అలాగే చెబుతుంటారు, మనం మన పని చేసుకుంటూ పోదామనుకుంటున్నారోగానీ… ఇన్ని వార్నింగ్స్ తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఆ బరితెగింపు ఎంతదాకా వచ్చిందంటే… చివరికి సొంత పార్టీ నేతలైనాసరే… తమ ఇలాకాలో కాంట్రాక్ట్ చేసుకోవాలంటే కప్పం కట్టాల్సిందేనట. అలవాటుపడ్డ ప్రాణాలు అస్సలు ఆగలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన ఓ మాజీ మంత్రి గురించి హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. సొంత పార్టీ ఎంపీ దగ్గర కూడా 10 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారట ఆయన సోదరుడు. ఎంపీ అయితే నాకేంటి… పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తావా, నువ్వు కంప్లయింట్ చేస్తే నేను భయపడిపోయి ప్యాంట్ తడిపేసుకోవాలా? అలాంటివేం నడవవు, పది శాతం కప్పం కట్టి తీరాల్సిందేనని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మేమే అధిష్ఠానం అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి కమ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా టీడీపీ ఎంపీనే బెదిరించినట్టు చెప్పుకుంటున్నారు. అదే ఏరియాకు చెందిన ఎంపీ బంధువు ఒకరు జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు. 7 కోట్ల రూపాయల విలువైన పైపులైన్ పనుల్ని టెండర్‌లో దక్కించుకుని పనులు మొదలుపెట్టారు. వెంటనే… స్థానిక ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పనులు తమకు అప్పగించాలని, లేకపోతే 10 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఏదైనా ఉంటే మా బంధువైన ఎంపీతో మాట్లాడుకోవాలని కాంట్రాక్టర్ చెప్పడంతో… ఆ బాధ్యతను తన తమ్ముడికి అప్పగించారు ఎమ్మెల్యే. దాంతో… మాజీ మంత్రి కమ్ ప్రస్తుత ఎమ్మెల్యే… సోదరుడు డైరెక్ట్‌గా ఎంపీకి ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చినట్టు సమాచారం. స్థానికంగా పనులు ఎవరు చేసినా.. 10 శాతం ఇవ్వాల్సిందేనని, ఇందులో మరో డిస్కషన్ లేదని చెప్పేశారట. ఆ పనులన్నీ తానే చేస్తున్నానని జిల్లాకే చెందిన లోక్‌సభ సభ్యుడు చెప్పినా వినకుండా, ఎంపీ అయినా వదలొద్దన్నది మా అన్న ఆదేశం అంటూ సొంత రాజ్యాంగం గురించి వివరించినట్టు తెలిసింది.
దీంతో ఆ ఎంపీ పార్టీ మారి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. స్పందించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పద్ధతి మార్చుకోమని హెచ్చరించినట్టు తెలిసింది. అయినా సరే… వెనక్కి తగ్గని ఎమ్మెల్యే…మళ్లీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి పెద్దోళ్ళకి చెబితే వదిలేస్తామా? ఇది మా సామ్రాజ్యం. ఇక్కడ మేమే అధిష్ఠానం. మేం అడిగినట్టు 10 శాతం కమీషన్ ఇవ్వకపోతే పనులు చేయనివ్వం, డబ్బులు ఇవ్వకుండా పనులు మొదలుపెడితే సామగ్రి ఎత్తుకెళ్లిపోతాం’ అంటూ ఓ రేంజ్‌లో బెదిరింపులకు పాల్పడ్డట్టు చెప్పుకుంటున్నారు. చివరికి అధికార పార్టీకి చెందిన ఎంపీనే… పోలీసుల దాకా వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చని టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సొంత పార్టీకి చెందిన ఎంపీనే అంత భయంకరంగా బెదిరించడంతో… కొన్ని నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోందో ప్రభుత్వ పెద్దలకు తెలుస్తోందా అన్న చర్చ మొదలైంది. వార్నింగ్ ఇచ్చినా వినకుండా… అధిస్టానమా…అయితే మాకేంటి…. అనే వరకు పరిస్థితి వచ్చిందంటే…. లోపం ఎక్కడుందో తెలుసుకుని కీలెరిగి వాత పెట్టాల్సిన టైం వచ్చిందన్న మాటలు టీడీపీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చిన సదరు మాజీ మంత్రి పార్టీ మారినా బుద్ధి మాత్రం మారలేదని గుసగుసలాడుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇది ఎంపీ మేటర్ కాబట్టి బయటికి వచ్చింది. అలా బయటికి రాకుండా ఎంతమంది కాంట్రాక్టర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారోనన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ పెద్దలంతా పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని ప్రపంచమంతా తిరుగుతుంటే… క్షేత్ర స్థాయికి వచ్చేసరికి ఇలాంటి దగుల్బాజీ వ్యవహారాలతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతోందన్నది టీడీపీ కేడర్ వాయిస్.