సొంత పార్టీ నేతలు టార్గెట్‌గా రాజాసింగ్ చెలరేగిపోతుంటే… స్పందన లేదు ఎందుకు? తీవ్ర పదజాలం వాడుతున్నా… ఇటు ఖండనలు లేవు, అటు షోకాజ్ నోటీస్‌లు లేవు? గోషామహల్ ఎమ్మెల్యే విషయంలో కాషాయ పెద్దల వ్యూహం ఏంటి? క్రమ శిక్షణకు కేరాఫ్‌గా చెప్పుకునే పార్టీ నాయకత్వం ఎందుకు కామ్‌గా ఉంది? అసలు రాజాసింగ్ విషయంలో పార్టీ వైఖరేంటి? కొద్ది రోజులుగా సొంత పార్టీ బీజేపీ మీదికే అస్త్రాలు సంధిస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మధ్య కాలంలో అయితే.. కాస్త డోస్ కూడా పెంచేశారాయన. సందు దొరికితే చాలు… పార్టీ రాష్ట్ర నాయకుల మీదికి మాటల తూటాలు పేలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు ఇచ్చినప్పుడు పార్టీలో మగాళ్ళెవరూ లేరా అంటూ కామెంట్ చేశారు రాజాసింగ్. ఇక తాజాగా పార్టీ నేతలను దొంగలు అన్నారు… పెద్ద పాకేజ్ ఇస్తే పార్టీని బీఆర్‌ఎస్‌కు అమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు రాజాసింగ్. గతంలో ఇదే జరిగిందని అన్నారాయన. ఇలా మాట్లాడుతున్నందుకు తనకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోందని, నోటీసులు కాదు… అసలు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ బీజేపీ నాయకత్వానికే సవాల్ విసిరారు గోషామహల్ ఎమ్మెల్యే. అటు ఇటు కాని వాళ్ళతో కలిసి పార్టీని బలోపేతం చేయలేమంటూ… బహిరంగంగా అన్నారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో నిజం చెప్పి… వాళ్ళ జాతకాలను ప్రజల ముందు పెట్టి మరీ బయటికి వెళతానంటూ హెచ్చరించారు కూడా. డైరెక్ట్‌గా పార్టీ నాయకత్వాన్నే టార్గెట్ చేసి… రాజాసింగ్ చెలరేగిపోతున్నా… అట్నుంచి స్పందన ఎందుకు ఉండటం లేదన్న చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. ఆయన మాటలపై పార్టీ నేతలంతా పొడిపొడిగా మాట్లాడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని దాట వేస్తున్నారు తప్ప గట్టిగా ఎవరూ ఖండించడం లేదు. ఇలా ఎందుకన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇటు పార్టీ శ్రేణుల్లో.. మొదటిసారిగా రాజా సింగ్ వ్యవహారంపై వ్యతిరేకత కనిపిస్తోందట. కొందరైతే… సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్నారు. ఇది కచ్చితంగా క్రమ శిక్షణ ఉల్లంఘనే అన్నది ఎక్కవ మంది కార్యకర్తల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక కేంద్ర పార్టీ దృష్టికి కూడా రాజా సింగ్ వ్యవహారం వెళ్ళిందట. అయితే… ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆయన మీద ఉన్నపళంగా చర్యలకు ఆస్కారం లేదని అంటున్నారు పార్టీ సీనియర్ లీడర్స్. రాజా సింగ్… తాను పార్టీ కన్నా గొప్ప వాడినన్న అభిప్రాయం తో ఉన్నారని, ఆయనేమీ కళ్యాణ్ సింగ్ కన్నా పెద్ద వాడు కాదు కదా అన్నది ఇంకొందరి ప్రశ్న. అడ్డసుడి మాటలతో తన రాజకీయ భవిష్యత్‌కు తానే సమాధి కట్టుకుంటున్నారన్నది ఓ సీనియర్ నేత మాట. ఎమ్మెల్యేకి ఏదైనా ఇబ్బంది ఉంటే…ఢిల్లీ నేతలకు చెప్పుకోవచ్చు కదా… ఇక్కడి వాళ్లతో సరిపడకుంటే… అక్కడ పెద్దలు ఉన్నారు కదా అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదే సమయంలో… రాజా సింగ్ కూడా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దామన్న ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాజా సింగ్ తన వాట్సాప్ లో పార్టీ నేతలపై మేసేజ్ లు పెడుతున్నారు తప్ప కెమెరా ముందు వాళ్ళని తిట్టడం లేదు. మిగతా విషయాలపై వీడియోలు పంపించే రాజా సింగ్… ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నారన్న మాట బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీకి కొత్త నాయకత్వం వచ్చే వరకు రాజా సింగ్ పై చర్యలు ఉండక పోవచ్చన్నది ఎక్కువ మంది పార్టీ నాయకుల అభిప్రాయం. రాజా సింగ్‌కు నోటీసులైనా, మరోటైనా… అది కేంద్ర పార్టీ పరిధిలోని అంశమని, ఢిల్లీలో ప్రస్తుతం అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదని చెబుతున్నాయి కాషాయవర్గాలు. మొత్తం మీద తెలంగాణ బీజేపీకి మాత్రం రాజాసింగ్ కొరకరాని కొయ్యలా మారాడన్నది ఇంటర్నల్ వాయిస్.