ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారుల్ని ఇప్పుడో టీడీపీ ప్రజాప్రతినిధి తీవ్ర స్ధాయిలో బెదిరిస్తున్నారా? నెలనెలా నాకు కప్పం కట్టకుండా వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తానంటూ వార్నింగ్స్ ఇస్తున్నారా? మాట వినని వాళ్ళ మీదికి పోలీస్, మైనింగ్ ఆఫీసర్స్‌ని ఉసిగొల్పుతున్నారా? మీ పాటికి మీరు యాపారాలు చేసేసుకుంటే.. నాకేంటి అంటున్న ఆ నాయకుడు ఎవరు? ఆ కప్పాల కహానీ ఏంటి? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారం ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు ఎక్స్‌పోర్ట్స్ మందగించి ఆదాయం తగ్గిపోయి నానా తంటాలు పడుతుంటే…అంతకు మించి పొలిటికల్ గ్రహణం పట్టి పీడిస్తోందని వాపోతున్నారు వ్యాపారులు. చెల్లించాల్సిన రాయల్టీ వసూలుకు ప్రభుత్వం తరపున ప్రైవేటు సంస్థ రంగంలోకి దిగి ముక్కు పిండి వసూలు చేస్తుండగా… స్దానిక ప్రజాప్రతినిధులు అయితే… మాకేంటి అనడం మరింత ఇబ్బందిగా మారుతోందట. ఇన్నాళ్ళు ఈ జాడ్యం ఎమ్మెల్యేలకే పరిమితం కాగా… ఇప్పుడు స్థానికంగా ఉండే ఢిల్లీ లీడర్ ఒకాయన గల్లీ స్థాయికి దిగి మీరు మీరు పంచుకుంటే సరిపోతుందా…? నా సంగతేంటి అనడంతో సరిపెట్టకుండా… తన అధికారాన్ని వాడి ఆఫీసర్స్‌ని ఎగదోయడంతో పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతోందట గ్రానైట్ వ్యాపారుల పరిస్థితి. అటు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రాయల్టీ, ఇటు రాజకీయ నేతలకు కప్పం కట్టలేక లబోదిబోమంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు మండలాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి.
అంతా వ్యాపారుల చేతిలో ఉన్నంత వరకూ బాగానే ఉన్నా… రాజకీయ నేతల ఎంట్రీతో ఎవరు అధికారంలో ఉంటే క్వారీల మీద వారి పెత్తనం నడుస్తోంది.కరోనా తర్వాత ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. అదలా ఉండగానే…. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల నుండి రాయల్టీ వసూలు చేసే బాధ్యతల్ని ఏఎంఆర్ సంస్థకి అప్పగించింది. దాంతో… అప్పటి వరకూ ఉన్న రేట్లను దాదాపు డబుల్ చేసి వసూలు మొదలు పెట్టింది ప్రైవేట్ సంస్థ. ఎక్కడికక్కడ గ్రానైట్ టోల్ గేట్లు పెట్టుకుని ప్రైవేట్ సైన్యంతో వసూళ్ళ పర్వానికి తెర లేపారు. సదరు ఏఎంఆర్ సంస్థతో టీడీపీలోని ఓ ముఖ్య నాయకుడికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా కటింగ్ ఫ్యాక్టరీల నుంచి మిషనరీ కెపాసిటీని బట్టి 50 వేల మొదలు 2 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.దీంతో గ్రానైట్ వ్యాపారులకు రాయల్టీ తదితరాల రూపంలోనే భారీగా ఖర్చవుతోంది. ఇక రాజకీయ నాయకులు నియోజకవర్గాన్నికి ఇంతని వసూలు చేస్తుంటడంతో…లాభాల సంగతి అటుంచితే గ్రానైట్ రాయిని ఇతర ప్రాంతాలకు పంపాలంటేనే తడిసి మోపెడవుతోందని అంటున్నారు వ్యాపారులు. అంతకు ముందు వ్యాపారం కళకళలాడినా… గత దశాబ్ద కాలంగా దీనిమీద రాజకీయ నేతల కన్ను పడటంతో సీన్ మొత్తం మారిపోయింది. అటు ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇటు లోడ్‌తో లారీలు ప్రయాణం చేసే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక్కో లారీకి 8 నుంచి 12 వేల వరకూ కప్పం కట్టాల్సి రావడం భారంగా మారుతోందంటున్నారు వ్యాపారులు. ఇందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉన్నా..మెజార్టీ మాత్రం వసూళ్ళ బ్యాచేనట.ఒక్కొక్క లారీ ఇటు హైదరాబాద్ అయినా, అటు చెన్నై పోర్టుకు వెళ్లాలన్నా దారిలో తగిలే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నిర్ణయించిన కప్పం కట్టాల్సిందేనంటున్నారు. లేకపోతే సంబంధిత అధికారులు ఎంట్రీ ఇచ్చి భారీ మొత్తంలో ఫైన్లు వేసి లారీలు సీజ్ చేసే వరకూ వెళ్తారు.. దీంతో వ్యాపారులు కూడా మారు మాట్లాడకుండా… చెల్లించి రూట్ క్లియరెన్స్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ రెగ్యులర్‌గా జరిగిపోతున్న టైంలో.
ఇప్పుడు కొత్తగా మరో ప్రజాప్రతినిధి ఇందులోకి ఎంటరైపోయారట. ఎమ్మెల్యేలకు ఇస్తే సరిపోతుందా..? ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిన నేను మాత్రం లీడర్‌ని కాదా? వాళ్ళందరి కంటే ఎక్కువ పరిధి నాది. మరి నాసంగతేంటో తేల్చమని కూర్చోవడంతో… ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు గ్రానైట్ వ్యాపారులు. అంతటితో ఆగని ఆ ఢిల్లీ లీడర్ గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో నాకు తెలుసు… ఆ లిస్ట్ ప్రకారమే నాక్కూడా నెలవారీ వాటాలు రావాల్సిందేనని వత్తిడి చేస్తున్నారట. ఆయనకు టచ్ లోకి వెళ్ళని కొన్ని గ్రానైట్ క్వారీలపై ఇటీవల మైనింగ్ అధికారులతో దాడులు కూడా చేయించినట్టు చెప్పుకుంటున్నారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడటంతో గ్రానైట్ వ్యాపారులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఏఎంఆర్ తో పాటు స్దానిక ఎమ్మెల్యేలకు లెక్కకట్టి అప్పగిస్తున్న గ్రానైట్ వ్యాపారుల మీదకు నేరుగా ఆ ఢిల్లీ నాయకుడు వాటాల కోసం కాలు దువ్వడం ఇప్పడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. నెలనెలా తనకు రావాల్సిన వాటాను లెక్కకట్టి అందేలా చూసే బాధ్యతను పోలీస్, మైనింగ్ అధికారులకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.దీంతో ఈ వ్యవహారాన్ని జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా అయితే వ్యాపారాలు చేసుకోలేమని విషయాన్ని మంత్రి లోకేష్ నోటీస్‌లో కూడా పెట్టేస్తామంటున్నారట వ్యాపారులు. ఇప్పటికే కట్టుదాటుతున్న కొందరు ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్స్ ఇస్తున్న సీఎం చంద్రబాబు ఈ ఢిల్లీ ప్రజాప్రతినిధి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.