మేమంటే…. మరీ అంత ఎకసెక్కాలైపోయాయా? ఎంత ఫారెస్ట్ ఏరియా అయితే మాత్రం అంత కామెడీగా ఉందా? ఏకంగా మా పేరునే లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్ధకంగా చేస్తారా అంటూ… డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎవర్నో సంతృప్తి పరచడానికి మాకు అడ్రస్ లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటోంది ఎక్కడ? బలమైన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తం అవుతున్నా… మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా రగులుతున్నాయి. ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు ఇక్కడి జనం. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందా? పులిహోరలో పులి ఉందా లాంటి జోక్స్‌ని గుర్తు చేసుకుంటూ మేం మరీ… అంత కామెడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దల్ని తిట్టి పోస్తున్నారు. వాళ్ళ ఆవేదనకు అసలు కారణం… పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతంగాని, ప్రాజెక్ట్‌గాని లేవట. పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్ళు తుడవడానికంటూ ఫైరైపోతున్నారు స్థానికులు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్స్ పరిధిలోని 11 మండలాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముంపు మండలాలుగా పేరున్న ఈ ప్రాంతానికి పోలవరం జిల్లా అనే పేరు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ జిల్లా పరిధిలోకి రంపచోడవరం, కూనవరం, మారేడుమిల్లి, దేవీపట్నం, గంగవరం, అడ్డతీగల,రాజవొమ్మంగి, వీ రామచంద్రాపురం, వై రామవరం ,చింతూరు, యటపాక మండలాలు వస్తాయి. కానీ…. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంగాని, రాష్ట్రానికి జీవ నాడిగా చెబుతున్న ప్రాజెక్టు ప్రాంతంగాని ఈ ప్రతిపాదిత జిల్లా పరిధిలోకి రాదు. ఇక్కడే మండుతోందట నియోజకవర్గ ప్రజలకు. దశాబ్దాల కలగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న సమయంలో ప్రాజెక్ట్ సైట్‌గాని, మా నియోజకవర్గంగాని లేకుండా జిల్లాకు పోలవరం పేరు ఎలా పెడతారు? ఇదంతా ఎవర్ని మోసం చేయడానికి అంటూ మండిపడుతున్నారు.
ఇటీవల జరిగిన ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ పలువురు ఎమ్మెల్యేలు ఇన్చార్జి మంత్రిని ఇదే విషయంపై ప్రశ్నించినట్టు సమాచారం. కొత్త జిల్లా ఏర్పాటుపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారట. వాస్తవానికి పోలవరం పేరు గోదావరి జిల్లాలకు ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఆ పేరుతో సంబంధంలేని ప్రాంతాలకు పోలవరం పేరును పెట్టడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండలాలను కలుపుతూ ఏర్పాటు చేయబోయే జిల్లాకు ఆ ప్రాంతానికి సంబంధించిన వేరే పేరు ఏదైనా పెడితే బాగుంటుంది తప్ప ప్రాజెక్ట్‌ను ఒక ప్రాంతంలో ఉంచుకుని.. మరో ప్రాంతానికి అదే పేరు పెడితే గజిబిజి గందరగోళం తప్ప పైసా ప్రయోజనం ఉండబోదన్న వాదన బల పడుతోంది. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు చాలా మంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై తమకున్న అభ్యంతరాలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట లోకల్ లీడర్స్. 2022 వరదల సమయంలో పోలవరం నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అవసరమైతే ముంపు మండలాలన్నింటినీ కలిపి పోలవరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చినట్టు చూపించేందుకే పేరు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. భౌగోళికంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో పాటు సెంటిమెంటుతో ముడిపడి ఉన్న పోలవరం పేరును అసలు చోట కాకుండా…. పక్క ప్రాంతానికి పెట్టడంపై అభ్యంతరాలు గట్టిగానే ఉన్నాయి. పోలవరం జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం 30 రోజుల గడువు ఇవ్వడంతో… ఈ లోపు తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు స్థానిక నాయకులు, పోలవరం నియోజకవర్గ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.