తెలంగాణలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల మీద వేటు తప్పదా? అందుకు వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమయ్యారా? ఇక రణమే తప్ప…శరణం లేదని డిసైడై… వాళ్ళు కూడా అజెండా ఫిక్స్ చేసుకున్నారా..? మొత్తం పది మంది పార్టీ ఫిరాయిస్తే… వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది? ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడం తప్ప మరో గత్యంతరం లేదని వాళ్ళు కూడా ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే సీఎంని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. వాళ్ళ వాదన ఎలా ఉన్నా… ఈ విషయంలో… చర్చ మాత్రం సీరియస్‌గానే నడుస్తోంది. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో ఏదో ఒక చర్య తీసుకుంటారన్న టాక్ బలంగా ఉంది. ఐతే అనర్హత వేటేయడానికి టెక్నికల్‌గా… ఆధారాలు లేవని భావిస్తున్న శాసనసభ్యులు… అభివృద్ధి కోసమే సీఎంని కలిసినట్టు వివరణ ఇచ్చుకుంటున్నారు. మొత్తం పది మంది పార్టీ ఫిరాయించగా… అందులో.. 8 మంది ఇదే తరహా సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దానికి సంబంధించి స్పీకర్ ట్రయల్ కూడా మొదలైపోయింది.
గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కృష్ణ మోహన్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. మిగతా నలుగురికి కూడా ట్రయల్ తేదీ ఫిక్స్ చేయబోతున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. వాళ్ళలో ఒకరు కడియం శ్రీహరి, మరొకరు దానం నాగేందర్. అందరిలాగే… వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్. కానీ… కొంత గడువు కావాలని కోరారు ఆ ఇద్దరూ. ఆ గడువు కూడా మంగళవారంతో ముగుస్తుంది. దీంతో నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అందరికీ మిగతా వాళ్ళ విషయంలో పెద్దగా డౌట్స్ లేకున్నా…దానం, కడియం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కడియం శ్రీహరి కూతురు కావ్య గత లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆమె ఎన్నికల ప్రచారంలో శ్రీహరి పాల్గొన్నారు. అంతా తానై మేనేజ్ చేశారు.
బీఆర్‌ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేసినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి…పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన మీద చర్యలు ఉండొచ్చని అంటున్నారు. ఆయన ప్రచారం చేసిన వీడియోలు తెర మీదికి వచ్చి తిరుగులేని ఆధారాలు అవుతాయన్నది విశ్లేషకుల మాట. కడియం శ్రీహరి.. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరారు. న్యాయపరంగా వచ్చే చిక్కులపై స్టడీ చేస్తున్నారట ఆయన. అదే సమయంలో అవసరం అనుకుంటే… స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికకు కూడా కడియం శ్రీహరి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే… నియోజకవర్గ అభివృద్ధి పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారట ఆయన. సీఎం రేవంత్ దగ్గరికి డెవలప్మెంట్ పనుల కోసమే వస్తూ… అనుమతులు తీసుకెళ్తున్నారు. ఒక వేళ తేడా వచ్చినా…నేను సిద్ధంగా ఉన్నాననే ఇండికేషన్ ఇస్తున్నారు కడియం.ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కూడా.. ఇదే తరహా చర్చ నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ.. పెద్దల్ని దారిలోకి తెచ్చుకోవాలని మొదట భావించారట ఆయన. కానీ అది వర్కవుట్ అవకపోగా…పార్టీలో ఆయనపై కొంత వ్యతిరేకత ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ఇంతలో అనర్హత పిటిషన్ అంశం సీరియస్ అయ్యింది.
పార్టీ ఫిరాయింపుల చట్టం ఆధారంగా చూస్తే… కడియం శ్రీహరికంటే ఎక్కువగా దానం నాగేందర్ ఇరుక్కున్నారన్నది విస్తృతాభిప్రాయం. ఆయన బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి… రాజీనామా చేయకుండానే, కాంగ్రెస్ సింబల్ మీద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీని ఆధారంగా దానం మీద వేటు పడుతుందేమోనన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే…అంతకంటే ముందే రాజీనామా చేసి.. ఖైరతాబాద్ బరిలో ఉండాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ…అందుకు పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్నది డౌటేనన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలంతా పూర్తి స్థాయిలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మీద ఫోకస్ పెట్టారు. ఏ నిర్ణయం అయినా…ఆ ఎలక్షన్ తర్వాతే తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి అనర్హత వేటు అంశం.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్ని షేక్ చేస్తోంది. వేటు తప్పదని అనుకుంటే రాజీనామా రూట్‌నే ఎంచుకోవచ్చన్నది రాజకీయవర్గాల మాట.