తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కన్ఫామ్ అయిపోయిందా? ఇన్నాళ్ళు ఉన్న అనుమానాలకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చేశారా? వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను. తిరిగి రాజకీయ శక్తిగా సభలో అడుగుపెడతానని చెప్పడం వెనక ఉద్దేశ్యం పార్టీ ఏర్పాటేనా? మరి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? పార్టీ ఏర్పాటులో ఆమె ఏ ఫార్ములాను అనుసరించబోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి గతంలోనే రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తాజాగా సభలో అందుకు కారణాలను వివరించారు. తనకు బీఆర్‌ఎస్‌లో తీవ్రమైన అవమానాలు జరిగాయంటూ మొదలుపెట్టి…ఒక దశలో తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా టచ్ చేశారు. ఇక బీఆర్ఎస్‌కు నైతికత లేదంటూ సభ సాక్షిగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఇక చివరిగా… తాను ఇప్పుడు ఒక వ్యక్తిగా బయటకి వెళ్తున్నానని, భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా మళ్లీ వస్తానని అనడం చుట్టూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. కానీ… ఆమె మాత్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో సోమవారం శాసనమండలిలో తన రాజీనామాను సమర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొత్త పార్టీని కన్ఫామ్ చేసినట్టేనని అంటున్నాయి రాజకీయవర్గాలు. భవిష్యత్‌లో రాజకీయ శక్తిగా తిరిగి సభకు వస్తానని అనడం వెనక ఉద్దేశ్యం కొత్త పార్టీయేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కొత్త పార్టీ కోసం ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో కొద్ది రోజులుగా జనంలోనే ఉంటున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు చుట్టి రావాలన్నది ఆమె ప్లాన్. కొత్త పార్టీ కోసం చేసే ప్రాధమిక కసరత్తులో భాగంగానే… జాగృతి జనం బాట అన్నది పరిశీలకుల మాట. ఇక మంగళవారం నాడు తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు కవిత. రాష్ట్రస్థాయి కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలు అన్నింటిని పిలిచి మాట్లాడారామె.ఈ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే సగం జిల్లాలు చుట్టి వచ్చానని, ఆ టైంలో పార్టీ పెట్టాలన్న సూచనలు చాలా వచ్చాయంటూ మీటింగ్‌లో చెప్పారట ఆమె. తెలంగాణ జాగృతి త్వరలోనే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వెళ్తుందని సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత మిగిలిన జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు ఎమ్మెల్సీ. ఇప్పటివరకు జరిగిన టూర్ వేరు, ఇక రాబోయే జిల్లాల పర్యటన వేరు అంటున్నారు జాగృతి నేతలు.
సంక్రాంతి తర్వాత చేయబోయే జిల్లాల పర్యటనలో ఆమె పార్టీ ఏర్పాటుకు సంబంధించి కీలకమైన ప్రకటనలు చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు తన తండ్రి అనుసరించిన విధానాన్నే ఫాలో అవబోతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడి రాజీనామా చేసి బయటకు వచ్చిన కేసీఆర్… జలదృశ్యంలో పార్టీ ప్రకటన చేశారు. అలాగే కవిత కూడా శాసనమండలిలో రాజీనామా కంటే ముందు ఉపన్యాసం ఇచ్చి బయట తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి కచ్చితంగా పార్టీ పెడతానని చెప్పారు. ఇక పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు, జెండా అజెండా పనిలో పడతాం అంటున్నారు కవిత అనుచరులు. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి ఒక సంస్థ మాత్రమే ఉందని, అదే పేరుతో రాజకీయ పార్టీ వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కొత్త పార్టీ విధివిధానాలు ఎలా ఉంటాయో చూడాలి.