ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారా..? నోటితో మాట్లాడుకుంటూనే నొసటితో వెక్కిరించుకుంటున్నారా…? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పాలల్లో నిప్పులు రగుతున్నాయా? పాలల్లో నిప్పులేంటి…? ఇదేదో తేడాగా ఉందే…. అనుకుంటున్నారా? ఎస్…. మీ డౌట్ కరెక్టే. ఆ తేడా ఏంటో చూసేయండి. మదర్ డైరీలో మూడు డైరెక్టర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు… బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పదం ఎందుకని ప్రశ్నిస్తున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ గెలుచుకునేలా ఒప్పందం కుదిరిందని, దీని వెనక ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే.
ఏ ఒక్క స్దానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా… ఆలేరు ఎమ్మెల్యే నైతిక భాధ్యత వహించి.. తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు తుంగతుర్తి శాసనసభ్యుడు. ఆలేరు నియోజకవర్గంలోనే… మదర్ డైరీ డైరక్టర్లను ఎన్నుకునే ఓటర్లు ఎక్కవగా ఉన్నారని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యదే బాధ్యత అన్నది ఆయన వాదన. ఆలేరు నియోజకవర్గానికే చెందిన డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్‌లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే పనులు చేస్తున్నారంటూ.. తీవ్ర పదజాలంతో సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు సామేల్.. ఓ వైపు బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేసేందుకు సీయం రేవంత్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తుంటే… కొందరు నేతలు మాత్రం ఇలాంటి వంకర పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మందుల.
నకిరేకల్ నియోజకవర్గంలోని ఒక డైరక్టర్ స్దానానికి జరిగే ఎన్నికకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకరికి, ఎమ్మెల్యే వేముల వీరేశం మరో అభ్యర్దికి తమ మద్దతు ప్రకటించగా.. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన రెండు డైరక్టర్ స్దానాలకు కాంగ్రెస్ అభ్యర్దులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి కోసం ఆలేరు కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా పనిచేస్తున్నారంటూ తప్పు పడుతున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే.అది కూడా తనకు సమాచారం లేకుండా, ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ అభ్యర్ది గెలుపుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారించడం వెనక మర్మం ఏంటన్నది ఆయన క్వశ్చన్. నా నియోకవర్గంలో మీ పెత్తం ఏంటని ప్రశ్నిస్తున్నారు మందుల. ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు, మదర్ డైరీ చైర్మన్‌కు వేరే నియోకవర్గాల్లో కూడా ఇలాగే జోక్యం చేసుకునే దమ్ముందా అన్నది ఆయన క్వశ్చన్. కొంత కాలంగా అధికార నేతల మధ్య జరుగుతున్న అధిపత్య పోరుకు దీన్ని పరాకాష్టగా చెప్పుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు.
అయితే… మొత్తం ఈ ఎపిసోడ్‌లో పలికింది మందుల సామేల్ ఐనా.. పలికించింది మాత్రం మరో సీనియర్ నేత అనేవాళ్ళు కూడా ఉన్నారు. పాలు, నీళ్లుగా కలిసిపోవాల్సిన అధికార పార్టీ నేతల మధ్య మదర్ డైరీ పేరుతో రచ్చ జరగడానికి అది ఆదాయ వనరు కావడమే కారణం అన్న చర్చ జరుగుతోంది. డైరీ నష్టాలపాలైనాగానీ.. అందులో పదవులు అనుభవించిన వాళ్ళు మాత్రం ఆర్థికంగా, రాజకీయంగా బలపడటం వెనక అసలు కధ వేరే ఉందని అంటున్నారు.. మదర్ డైరీ పాల సేకరణ లెక్కల్లో తేడాలు, కమీషన్స్ దండుకోవడాలు, ఇలా చాలా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇది పైకి కనిపించని ఆదాయ వనరు కావడంతో… డైరీ మీద గుత్తాధిపత్యం సంపాదిస్తే… ఆర్ధిక వనరులకు ఢోకా ఉండదని… రాజకీయంగా కూడా బలోపేతం కావచ్చన్న ఉద్దేశ్యంతోనే… అలా రోడ్డెక్కుతున్నట్టు చెప్పుకుంటున్నారు.