మంచి తరుణం మించిన దొరకదు…., దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం…, దుమ్ము దులిపేద్దామన్నట్టుగా ఆ ఎమ్మెల్యే మనుషులు వసూళ్ళ పర్వానికి తెర లేపారా? మాట వినే అధికారులను డిప్యుటేషన్ మీద రప్పించుకుని మరీ… వ్యవహారాలు చక్కబెట్టేసుకుంటున్నారా? అసలక్కడ ఉద్యోగం చేయాలంటేనే… రెగ్యులర్ ఎంప్లాయిస్ భయపడే పరిస్థితి వచ్చిందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పరిధి చిన్నదే అయినా… పొలిటికల్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్. ఇక్కడి నుంచి 2024ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచారు బొమ్మడి నాయకర్. ఆ గెలుపులో టీడీపీ కేడర్‌తో పాటు అదేపార్టీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు కీరోల్ ప్లేచేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు లోకల్ జనసైనికులు. కానీ… అలాంటి సీనియర్స్ అంతా… ఇప్పుడు ఎమ్మెల్యేతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలయ్యేదాకా…అందరి వాడినన్నట్టు వ్యవహరించిన ఎమ్మెల్యే… గెలిచాక మాత్రం ఓ ఒక్కర్నీ దగ్గరికి రానివ్వలేదని సమాచారం. ఇందులో మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గంలోని టిడిపి, జనసేన నేతలు సైతం ఉన్నారట. చిన్నా చితకా పనుల కోసం ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే… మొదట్లో కాస్తో కూస్తో స్పందిచేవారని, ఇప్పుడు మాత్రం మీరు డయల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదన్న మాటలు వినిపిస్తున్నాయంటూ సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు లోకల్ లీడర్స్.
అందరితో డోంట్ కేర్ అన్నట్టుగా ఉండటంతో పాటు… మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు చెప్పిన పనులు చేసుకుంటూ వెళితే తన పరపతి తగ్గిపోతుందని ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోందట. చాలా విభాగాల్లో రెగ్యులర్ పోస్టింగ్స్ కాకుండా… డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళతోనే వ్యవహారం నడిపిస్తున్నారు. అందూలోనూ ఓ కిటుకు ఉందంటున్నారు. అలా డిప్యుటేషన్ మీద వస్తున్న వాళ్ళంతా… ఎమ్మెల్యే నాయకర్ అనుచరులతో మంచి సంబంధాలు ఉన్నవారేనని, వాళ్ళ ద్వారా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరవర్గం తీరుపై టీడీపీ వాళ్ళకంటే…. సొంతపార్టీ జనసేన నేతలే ఎక్కువ గుర్రుగా ఉన్నారట. డిప్యుటేషన్ మీదున్న అధికారులను అడ్డం పెట్టుకుని… నరసాపురంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న అసైన్డ్ భూముల్ని చక్కబెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో జరిగిన భూరిజిష్ట్రేషన్లపై అనేక ఆరోపణలు రావడం, కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవడం దీనికి ఊతమిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇపుడు మళ్ళీ అలాంటి వ్యవహారాలను నడిపించేందుకు ఎమ్మెల్యే అనుచరవర్గంగా చెప్పుకుంటున్న కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాల విషయానికొస్తే… టిడిపి ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో ఎమ్మెల్యే నాయకర్‌కు బాగానే సఖ్యత ఉందంటున్నారు. ఇద్దరూ కలిసి లోకల్‌గా మిగతా నేతల ప్రాబల్యం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారట.ఇంకా సూటిగా చెప్పాలంటే…. ఎమ్మెల్యే నాయకరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కూడా ప్రత్యేక కారణాలున్నాయట. టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుది క్షత్రియ సామాజికవర్గం. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బీసీ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు. కానీ… నరసాపురంలో కాపు ఓటర్ల డామినేషన్ ఎక్కువ. దీంతో కాపు నేతలు బలపడి తన కుర్చీ కిందికి నీళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట శాసనసభ్యుడు.
అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేనలో చేరి సైలెంట్ అవ్వాల్సి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు తెరమీదికి వస్తే తనకు ముప్పు అని భావిస్తున్న బొమ్మిడి నాయకర్… టీడీపీ ఇన్ఛార్జ్తో సఖ్యతగా ఉంటూ తన వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే నువ్వు… లేకుంటే నేను అన్నట్టుగా రామరాజు, నాయకర్ కలిసి పని చేస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. అదే సమయంలో కాపుల్లో కూడా తన బలం తగ్గకుండా ఉండేందుకు… వైసీపీలోని కాపు నాయకుల్ని ఎమ్మెల్యే దగ్గరికి తీస్తున్నారన్న విమర్శలున్నాయి. స్థానికంగా ఎక్కువ పనుల్ని వైసీపీ నేతలకే కేటాయిస్తూ… ఇటు ఆర్థికంగా, అటు పొలిటికల్‌గా లాభపడే ప్రయత్నాల్లో ఉన్నారట.
రాజకీయ ఎత్తుగడలు అలా ఉంటే…. నియోజకవర్గంలో జరుగుతున్న వసూళ్ళ గురించి మాత్రం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే డిప్యుటేషన్ మీద తనకు కావాల్సిన అధికారులను రప్పించుకుంటున్నారని, వాళ్ళ సాయంతో ఆయన అన్ని పనులు చక్కబెట్టుకుంటుండగా… కింది స్థాయిలో అనుచరులు కూడా అన్ని విభాగాల్లో తమ మనుషుల్ని పెట్టి… ప్రతి పనికో రేటు కట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పొలిటికల్‌గా ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో… అది వేరే సంగతిగానీ, డిప్యుటేషన్ మీదున్న అధికారుల ద్వారా ఆయన అనుచరగణం చేస్తున్న వసూళ్ళు మాత్రం పుట్టి ముంచడం ఖాయమన్న చర్చలు నడుస్తున్నాయి నియోజకవర్గంలో.